
Visakhapatnam: ముగ్గురు కుమార్తెల తరువాత కుమారుడు పుట్టాడు. దీంతో ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. కానీ వారి ఆనందం చూసి విధికి కన్నుకుట్టిందేమో.. పుట్టిన 15 రోజులకే మృత్యువు కబళించింది. కన్నవారికి అంతులేని విషాదాన్నిచ్చింది. అయితే కనీసం ఆ శిశువు మృతదేహాన్ని తరలించేందుకు ఆస్పత్రి యాజమాన్యం అంబులెన్స్ ఏర్పాటుచేయలేదు. ప్రైవేటు అంబులెన్స్ ఏర్పాటుచేసుకునేటంత స్థోమత వారికి లేదు. దీంతో ఆ దంపతులే విషాదాన్ని దిగమింగుకొని మృత శిశువును 120 కిలోమీటర్ల పాటు ద్విచక్ర వాహనంలో తరలించాల్సి వచ్చింది. ఆ తల్లిదండ్రులు పడిన క్షోభ అంతా ఇంతా కాదు. విశాఖ జిల్లాలో ఈ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కుమడ గ్రామానికి చెందిన చెండా మహేశ్వరికి నెలలు నిండడంతో కుటుంబసభ్యులు పాడేరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అదే రోజు పండంటి మగ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. అప్పటికే ఆమెకు ముగ్గురు కుమార్తెలు. మగబిడ్డ పుట్టడంతో కుటుంబసభ్యులు ఎంతగానో ఆనందపడ్డారు. అయితే శిశువకు శ్వాస సంబంధ వ్యాధి ఉండడంతో అక్కడి వైద్యులు కేజీహెచ్ కు అదేరోజు రిఫర్ చేశారు. అప్పటి నుంచి కేజీహెచ్ లో చికిత్సపొందుతున్న శిశువు గురువారం ఉదయం కన్నుమూసింది. దీంతో శిశువు మృతదేహాన్ని తరలించాలని తండ్రి మత్స్యరాజు ఆస్పత్రి వర్గాలను కోరాడు. కానీ వారెవరూ స్పందించలేదు. ప్రైవేటు అంబులెన్స్ లను ఆశ్రయిస్తే భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో దంపతులిద్దరూ స్కూటీపై శిశువు మృతదేహంతో బయలుదేరారు. 120 కిలోమీటర్ల ప్రయాణించి పాడేరు చేరుకున్నారు. అక్కడి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అంబులెన్స్ ఏర్పాటుచేయడంతో స్వగ్రామం కుమడ చేరుకున్నారు.

ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. నెటిజెన్లు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ఈ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది పాషాణ ప్రభుత్వం అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ తల్లిదండ్రులకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో ఆస్పత్రుల నిర్వహణ, ప్రజారోగ్యంపై పాలకులకు ఉన్న చిత్తశుద్ధిని ఈ ఘటన తెలియజేస్తోందన్నారు. తిరుపతి రుయా ఆస్పత్రి నుంచి ఒక బిడ్డ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఒక తండ్రి పడ్డ ఆవేదన,,, మచిలీపట్నం తీరంలో చనిపోయిన బాలుడి మృతదేహాన్ని తరలించేందుకు బంధువుల పడిన ఇక్కట్లను గుర్తుచేశారు. బెంజి సర్కిల్ లో అంబులెన్స్ లను నిలబెట్టి డ్రోన్ విజువల్స్ తీసి జెండా ఊపితే ప్రయోజనం ఉండదని విమర్శించారు. ఆస్పత్రుల్లో కనీస వసతులు ఏర్పాటుచేయలేని చేతగాని పాలకులు.. విశాఖను అభివృద్ధి చేస్తాం.. పాలనా వికేంద్రీకరణ అంటూ మాయమాటు చెబుతున్నారని పవన్ ఘాటుగా స్పందించారు. ఇప్పుడివి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.