Snail In Simhachalam Prasadam: ప్రముఖ దేవస్థానాల వద్ద కొంతమంది చేస్తున్న అతి విమర్శలకు తావిస్తోంది. మొన్న ఆ మధ్యన శ్రీశైలం ఆలయ సమీపంలో ఓ మహిళ పాటకు డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ పెట్టింది. దీనిపై విమర్శలు వచ్చాయి. ఆలయ వర్గాలు స్పందించాయి. పోలీస్ కేసుకు సిద్ధమవుతుండగా సదరు మహిళ క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసింది. అయితే ఇప్పుడు సింహాచలం అప్పన్న ఆలయ పులిహోరలో నత్త వచ్చిందని ఓ జంట తీసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని గోపాలపట్నం పోలీసులకు ఆలయ అధికారులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను మొదలుపెట్టారు.
రెండు రోజుల కిందట ఘటన..
రెండు రోజుల కిందట ఓ జంట సింహాచలంలోని అప్పన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం వారు కొనుగోలు చేసిన పులిహారలో నత్తగుల్ల వచ్చిందని ఆరోపించారు. ప్రసాదం కొనే ముందు ఒకటికి రెండుసార్లు చూసుకోవాలంటూ ఆ జంట చెప్పుకొచ్చింది. అయితే దీనిపై సింహాచలం దేవస్థానం అధికారులు వెంటనే స్పందించారు. సెల్ఫీ వీడియో తీసి వైరల్ చేసిన వ్యక్తులపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఆ జంట ఆరోపణలు చేసిందని పేర్కొన్నారు. దీనిపై వారు కేసు నమోదు చేశారు.
అనుమానాస్పదంగా వీడియో..
అయితే ఆ జంట ప్రసాదం కౌంటర్లో ఫిర్యాదు చేసామని చెప్పింది. వారు మరో పులిహోర ప్రసాదం ప్యాకెట్ ఇచ్చినట్లు కూడా వారు స్వయంగా చెప్పారు. అయితే ప్రసాదం తయారీ విభాగంలో సోషల్ మీడియాలో ఈ జంట పోస్ట్ చేసిన వీడియోను పరిశీలించారు. అయితే అది అనుమానాస్పదంగా అనిపించింది. పులిహోర తయారీకి అవసరమైన చింతపండు నానబెట్టిన తర్వాత యంత్రాలతో గుజ్జు తీస్తారు. కాబట్టి చింతపండులో నత్త వచ్చే అవకాశమే లేదు. సాధారణంగా పులిహోరలో వేసి పోపు సామాన్లు అయిన ఎండుమిర్చి, ఆవాలు, శనగపప్పు, వేరుశనగపప్పు, మెంతులు ముందుగానే నూనెలో వేయించి కలుపుతారు. కాబట్టి పోపుల తయారీలో కూడా నష్టం వచ్చే అవకాశం లేదు. ఇక్కడ పోపులకు సంబంధించిన సామాన్లను సెంట్రల్ స్టోర్స్ నుంచి బాగు చేసిన తర్వాతే ప్రసాదంలోకి వాడుతారు. పులిహోర తయారీకి అవసరమైన బియ్యాన్ని బాయిలర్లలో పసుపుతో ఉడికించిన తర్వాతే.. కలపడానికి పెద్ద స్టీల్ ట్రే లో వస్తారు. అయితే వీటి తయారీలో కూడా ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. తలకు క్యాప్ పెట్టుకుని గరిటలతో కలుపుతారు. కాబట్టి అక్కడ నత్త కలిసే అవకాశం లేదు.
ఉద్దేశపూర్వకంగానే..
అయితే ఆ జంట ప్రసాదం కౌంటర్లో ఫిర్యాదు చేస్తే సరైన రెస్పాన్స్ ఇవ్వలేదని చెప్పింది. కానీ ఎలాంటి తప్పుడు మాటలు అనలేదని కౌంటర్ సిబ్బంది చెబుతున్నారు. వారి నుంచి సైతం లిఖితపూర్వకంగా వాంగ్మూలం తీసుకున్నారు. ఆ జంట పరిస్థితి కూడా అనుమానాస్పద స్థితిలో ఉంది. ఉద్దేశపూర్వకంగానే అలా చేసి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి. పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నాయి ప్రభుత్వాలు ! pic.twitter.com/AFbWOrOlP1
— తెలుగు ప్రవచనాలు (@Pravachanaalu) December 29, 2025