Swarnandhra Vision 2047: పేదరికం లేని సమాజమే లక్ష్యంగా చంద్రబాబు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ ను ఆవిష్కరించారు. ప్రతి మనిషికి అవసరమైన కనీస వసతులు, ఉద్యోగ ఉపాధి మార్గాలను అందించేందుకు ఈ విజన్ ఎంతగానో దోహద పడనుంది. సమయం ఉన్నప్పుడు పనిచేసి, అవసరం ఉన్నప్పుడు పని చేయించుకునే కొత్త విధానం విజన్ 2047లో ఆవిష్కరించారు చంద్రబాబు. ప్రధానంగా డిజిటల్ లెర్నింగ్కు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో విద్యా బోధనతో పాటు పలు అంశాలపై శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలన్నది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. పేదవాడికి సైతం కార్పొరేట్ తరహాలో విద్యాబోధన అందించాలన్నది లక్ష్యంగా కనిపిస్తోంది. విద్యతోనే అభివృద్ధి సాధ్యం అన్న బలమైన నినాదాన్ని ప్రజల్లోకి పంపించేందుకు..చంద్రబాబు ప్రయత్నం గా కనిపించింది.
* వైద్య సేవలు మెరుగుపరచాలని..
ప్రతి కుటుంబంలో ఆరోగ్య సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంపాదనలో కొంత మొత్తం వైద్యానికి పోతోంది. అందుకే వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాలని తన స్వర్ణాంధ్ర విజన్ 2047లో బలమైన లక్ష్యాలను విధించారు చంద్రబాబు. ప్రతి గ్రామానికి దగ్గర్లోనే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, టెలి మెడిసిన్ సౌకర్యాలు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. తద్వారా బలమైన ఒక ఆరోగ్య వ్యవస్థను నిర్మించాలన్నదే చంద్రబాబు అభిమతంగా కనిపిస్తోంది.
* ఆర్థిక అభివృద్ధి లక్ష్యం
ప్రజలకు స్వయం ఉపాధి పథకాలు అందించాలన్నది ఈ విజన్ లక్ష్యం. ఇందుకోసం బ్యాంకింగ్ సేవలతో పాటు రుణాలు, ఆర్థిక అక్షరాస్యత వంటి కార్యక్రమాలను మరింత విస్తృతపరచనున్నారు. గతంలో డ్వాక్రా వ్యవస్థను తెచ్చి అభివృద్ధి చేసింది చంద్రబాబు. ఇప్పుడు మరోసారి అటువంటి వరవడిని ప్రవేశపెడతారు. అమలు చేసే ప్రయత్నం చేస్తారు. స్థానిక సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షించే వ్యవస్థలను అందుబాటులోకి తేనున్నారు. ఆర్థిక కార్యకలాపాలను మరింత విస్తృతం చేసేందుకు నిర్ణయించారు. పేదరికం లేని సమాజం కోసం.. ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం. 24 గంటల విద్యుత్ తో పాటు మంచినీరు అందించనున్నారు. వంటగ్యాస్, మరుగుదొడ్లు, మురుగునీటిపారుదల, సోలార్ రూఫ్ టాప్, డిజిటల్ కనెక్టివిటీ, సోలార్ విద్యుత్ వసతి వంటి సౌకర్యాలను కల్పిస్తారు. ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలనదే ఈ విజన్ లక్ష్యంగా కనిపిస్తోంది.