YCP: చంద్రబాబు( AP CM Chandrababu) ఆలోచన జగన్ చేస్తున్నారా? పార్టీ అధినేతగా ఉంటూ రాష్ట్ర పగ్గాలు మరొకరికి అప్పగించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2014 వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండేవారు చంద్రబాబు. కానీ తర్వాత జాతీయ అధ్యక్షుడిగా మారి రాష్ట్ర పార్టీ బాధ్యతలను వేరొకరికి అప్పగించారు. ఇప్పుడు జగన్ సైతం వైసీపీ రాష్ట్ర పగ్గాలు సీనియర్ నేతకు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం జగన్మోహన్ రెడ్డి సోలో అన్నట్టు పరిస్థితి మారింది. ఆపై ఆయన చుట్టూ ఆ నలుగురు చేరారని.. వారి వల్లే పార్టీ ఓడిపోయిందన్న విమర్శ ఉంది. అందుకే ఈసారి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను సీనియర్ నేతకు అప్పగించేందుకు జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తద్వారా పార్టీలో సీనియర్లకు సైతం గౌరవం కల్పించినట్లు అవుతుంది.
* విజయమ్మ తప్పుకోవడంతో..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతూ వచ్చారు. గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ ఉండేవారు. కానీ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడంతో ఆమెకు అండగా నిలిచేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకున్నారు విజయమ్మ. అప్పటినుంచి పార్టీని అంతా తానై నడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే గతంలో విజయసాయిరెడ్డి కొద్దిరోజులపాటు జగన్ తర్వాత అన్నట్టు పరిస్థితి ఉండేది. అటు తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ బాధ్యతలను చూస్తున్నారు. అయితే జగన్ చుట్టూ ఉన్న వారితో పని జరగదని.. పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది క్రియేట్ చేయాలన్న ఆలోచన వచ్చినట్లు సమాచారం. పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఉంటే.. రాష్ట్ర పార్టీ బాధ్యతలను వేరే నేతకు అప్పగిస్తే బాగుంటుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వినిపించిందట. అందుకే పార్టీలో ఒక సీనియర్ నేతకు అధ్యక్ష బాధ్యతలు కానీ.. పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా కానీ అవకాశం ఇస్తారని తెలుస్తోంది.
* సీనియర్ మోస్ట్ లీడర్..
ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ నేతగా ఉన్నారు ధర్మాన ప్రసాదరావు( dharman Prasad Rao). 1989లో తొలిసారిగా ఆయన పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగు పెట్టారు. మంత్రి కూడా అయ్యారు. రాజశేఖర్ రెడ్డి కి అత్యంత ఆప్తుడిగా మెదిలారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పదేళ్లపాటు మంత్రిగా వ్యవహరించారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో రెండున్నర ఏళ్ల పాటు మంత్రి అయ్యారు. మంచి వాగ్దాటితోపాటు సబ్జెక్టు ఉన్న నేత. అటువంటి నాయకుడికి వైసిపి రాష్ట్ర అధ్యక్ష పదవి కానీ.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కానీ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తద్వారా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ కి చెక్ పడవచ్చు అన్నది ఆలోచన. ఆపై జగన్మోహన్ రెడ్డి సీనియర్లను కలుపుతున్నారని సంకేతాలు పంపించినట్లు అవుతుంది. అందుకే త్వరలో ధర్మాన ప్రసాదరావు కు కీలక పదవి ఖాయమని తెలుస్తోంది.
