2024 Roundup: గత ఐదేళ్లుగా అమరావతి విషయంలో అనేక చిక్కుముళ్ళు కొనసాగాయి. 2019లో అధికారంలోకి వచ్చింది వైసిపి. అక్కడకు కొద్ది రోజులకే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు చోట్ల రాజధానులు నిర్మించాలని భావించింది.విశాఖను పాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా చేయాలని నిర్ణయించింది. దీంతో అమరావతి ఏకైక రాజధాని అంశం మరుగున పడిపోయింది. అలాగని మూడు రాజధానులు సైతం అమల్లోకి తేలేకపోయింది జగన్ సర్కార్. ఈ తరుణంలో ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పు రాజధానికి కీలకంగా మారింది. అమరావతికి కొత్త ఊపిరి పోసింది. ఒక విధంగా చెప్పాలంటే గత ఐదేళ్ల సంక్లిష్ట స్థితికి చెక్ చెప్పింది 2024. ఒక్క వైసీపీ తప్ప అమరావతి ఏకైక రాజధానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే ఎన్నికల ముందు వరకు మూడు రాజధానులు అంటూ హడావిడి చేసిన వైసిపి చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. కానీ అప్పటికే రాజధానుల విషయంలో వైసీపీతో విభేదించారు రాష్ట్ర ప్రజలు. మెజారిటీ ప్రజలు జగన్ సర్కార్ నిర్ణయాన్ని తప్పుపడుతూ విలక్షణ తీర్పు ఇచ్చారు.
* గత ఐదేళ్లుగా నష్టం
గత ఐదేళ్ల వైసిపి పాలనలో అమరావతి తీవ్రంగా నష్టపోయింది. వైసిపి మూడు రాజధానుల పేరుతో ఆడిన గేమ్ లో నిర్వీర్యం అయ్యింది. అప్పట్లో చంద్రబాబును నమ్మి ఏకంగా 36 వేల ఎకరాల భూములను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. వారంతా జగన్ సర్కార్ నిర్ణయంతో పోరాట బాట పట్టారు. చివరికి వారికి సకాలంలో ఇస్తామన్న కౌలు కూడా అందించకుండా ఇబ్బంది పెట్టింది జగన్ ప్రభుత్వం. ఏటా హైకోర్టుకు వెళ్లి కౌలు తీసుకోవాల్సిన పరిస్థితి అమరావతి రైతులకు ఏర్పడింది. గత ఐదేళ్లుగా అమరావతి రైతులు చేసిన పోరాటం ఆచంద్రార్కంగా నిలిచిపోతుంది. దానికి ఫలితం మాత్రం చూపించింది 2024.
* ఇక అంతా మంచి
అమరావతి రాజధాని కి తిరుగులేదు. ఆపడానికి ఎవరి తరం కూడా కాదు. గత అనుభవాల దృష్ట్యా వేగవంతంగా పనులు పూర్తి చేయాలని చూస్తోంది కూటమి సర్కార్. కూటమి గెలిచిన వెంటనే అమరావతికి కొత్త కల వచ్చింది. గత ఐదేళ్లుగా వెలగని విద్యుత్ దీపాలు వెలిగాయి. అసలు కాకులు దూరని కారడివిలా మారిపోయిన అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. అమరావతి 2019 నాటి యధా స్థానానికి వచ్చింది. కేంద్రం భారీగా నిధులు ఇస్తోంది. నవ నగరాల నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు.ఇలా ఎలా చూసుకున్నా 2024 అమరావతికి కొత్త ఊపిరి పోసింది.