https://oktelugu.com/

Petakamsetti Ganababu : ఆ సామాజిక వర్గానికి దక్కని మంత్రి పదవి.. నిజంగా లోటే!

విశాఖ జిల్లాలో అది బలమైన సామాజిక వర్గం. కానీ గత 15 సంవత్సరాలుగా ఆ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కలేదు. ఈసారి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచినా పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఆ సామాజిక వర్గంలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది.

Written By: Dharma, Updated On : November 20, 2024 1:30 pm
Petakamsetti Ganababu

Petakamsetti Ganababu

Follow us on

Petakamsetti Ganababu : తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు. వరుసగా నాలుగు సార్లు విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్నారు. 2009, 2014, 2019, 2024 ఎన్నికల్లో గెలిచారు గణబాబు. ఈసారి మంత్రివర్గంలో చోటు ఆశించారు. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఛాన్స్ దక్కలేదు. ఈ తరుణంలో చంద్రబాబు ఆయనకు విప్ పదవి ఇచ్చారు. నిన్ననే ఆయన తన బాధ్యతలను స్వీకరించారు. అయితే త్వరలో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని అనుచరులు ఆశాభావంతో ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన గణబాబుది గవర సామాజిక వర్గం. సుదీర్ఘ రాజకీయ నేపథ్యంలో ఉన్న కుటుంబం.ఆయన తండ్రి పథకం శెట్టి అప్పల నరసింహం ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలు అందించారు. విశాఖ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన వారసత్వం గా రాజకీయాల్లోకి ప్రవేశించిన గణబాబు వివాదాలకు దూరంగా ఉంటారు. ఒకే పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. దీంతో తెలుగుదేశం అంటేనే గణబాబు ఒక బ్రాండ్ గా కనిపిస్తున్నారు విశాఖలో. చంద్రబాబు వద్ద కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఎన్నికల్లో మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కానీ విప్ పదవితో సరిపెట్టారు.

* మూడు, నాలుగు నియోజకవర్గాల్లో ప్రభావం
విశాఖ జిల్లాలో గవర జనాభా ఎక్కువ. ఆ సామాజిక వర్గం మూడు నాలుగు నియోజకవర్గాల్లో ప్రభావితం చూపగలదు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం లో ఆ సామాజిక వర్గం అధికం. టికెట్ కోసం ఎంతోమంది ఆశావహ నేతలు ముందుకు వస్తున్నా చంద్రబాబు మాత్రం గణబాబుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఆయనకే టికెట్ కట్టబెడుతున్నారు. ఆయన సైతం అధినేత నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు సాగుతున్నారు. ఏకంగా నాలుగు సార్లు విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్నారు.

* ఆ రెండు పార్టీల్లో సముచిత స్థానం
విశాఖలో గవర సామాజిక వర్గానికి గత 15 ఏళ్లుగా మంత్రి పదవి దక్కడం లేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో దాడి వీరభద్ర రావు కు మంత్రి పదవి ఇచ్చేవారు. 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో పని చేశారు కొణతాల రామకృష్ణ. 2009లో ఆయన ఓడిపోయారు. మళ్లీ ఈ ఎన్నికల్లో జనసేన తరఫున గెలిచారు కొణతాల. ప్రస్తుతం జనసేన కూటమి ప్రభుత్వంలో ఉంది. దీంతో సీనియర్ నేతగా కొణతాలకు ఛాన్స్ దక్కుతుందని అంతా భావించారు. వివిధ సమీకరణలో భాగంగా ఆయనకు దక్కకపోయినా.. గణబాబుకు చాన్స్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ నిరాశ ఎదురయ్యింది. అయితే ఈసారి మంత్రి పదవి తప్పకుండా దక్కుతుందన్న ఆశాభావంతో ఉన్నారు గణబాబు. అందుకే విప్ పదవిని ఆనందంగా స్వీకరించినట్లు తెలుస్తోంది. మరి అధినేత చంద్రబాబు ఎలాంటి హామీ ఇచ్చారో? చూడాలి.