Jagan: ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రత్యర్థులపై విషం చిమ్మడంలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా బాగానే పనిచేస్తుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అది ఎల్లో మీడియా పని అని. దివంగత ఎన్టీఆర్ నుంచి నేటి జగన్ వరకు ఆ సెక్షన్ ఆఫ్ మీడియా ఎలాంటి ప్రచారం చేసిందో తెలుగు ప్రజలకు తెలియంది కాదు. వారికి కావాల్సింది చంద్రబాబు ప్రయోజనాలు. తెలుగుదేశం పార్టీ వర్గ ప్రయోజనాలు. అందుకు తగ్గట్టుగానే వారి ప్రాధాన్యాలు మారుతాయి. వారి విష ప్రచారం కొనసాగుతుంది.చంద్రబాబుకు ఇష్టమైతే ఇష్టం.. కష్టమైతే కష్టం అన్నట్టుగా ఉంటుంది ఎల్లో మీడియా వ్యవహారం.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సమయంలో నందమూరి తారకరామారావు వెన్నంటి నడిచింది ఆ సెక్షన్ ఆఫ్ మీడియా. కుల ప్రభావంతో ఎనలేని ప్రాధాన్యమిచ్చింది. ఏపీ సమాజంలో ఎన్టీఆర్ అంటే ఒక సమ్మోహన అస్త్రంగా మార్చడంలో ఎల్లో మీడియా సక్సెస్ అయ్యింది. అయితే అప్పటివరకు దేవుడిగా కనిపించిన నందమూరి తారక రామారావు.. లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత దెయ్యంగా కనిపించారు . ద్వేషించడం ప్రారంభించారు. చివరకు మనస్థాపంతో ప్రాణాలు విడిచే దాకా ఊరుకోలేదు. అంతలా గోబెల్స్ ప్రచారం చేశారు. ఇప్పుడు అదే ఎన్టీఆర్ ఫోటోతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పోనీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏమైనా మామూలుగా ఉంచారా అంటే అదీ లేదు. చివరి వరకు ఫ్యాక్షన్ ముద్ర ఉండేలా ప్లాన్ చేశారు. చివరకు రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినా.. సీఎం పదవి విషయంలో రాజశేఖర్ రెడ్డి పై అనుమానం కలిగేలా ఎన్నో రకాల కథనాలు ప్రచురించారు. వారికి ఫ్యాక్షనిస్ట్ గా కనిపించిన రాజశేఖర్ రెడ్డి.. చనిపోయే నాటికి ప్రజలకు దేవుడయ్యారు. కానీ వారి ప్రయత్నాలు నీరుగారిపోయాయి.
అంతెందుకు గత ఎన్నికల్లో ప్రధాని మోదీని ఏ స్థాయిలో కించపరిచారో అందరికీ తెలిసిన విషయమే. భార్యను చూసుకోలేని వాడు భారతదేశాన్ని ఎలా చూసుకుంటాడు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా పతాక శీర్షిక వండి వార్చింది. ఇప్పుడు అదే ప్రధాని మోదీని ఏ స్థాయిలో కీర్తిస్తున్నారు అర్థం చేసుకోవచ్చు. ప్రపంచానికి దిక్సూచిగా అభివర్ణిస్తున్నారు. అయితే ఒక్క ప్రధాని విషయంలోనే కాదు. తాజాగా సీఎం జగన్ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బాబాయి హత్య విషయంలో అబాసుపాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నాడు ఎన్టీఆర్ పై కుటుంబ సభ్యులను ప్రయోగించినట్టే.. ఇప్పుడు జగన్ పై కూడా ప్రయోగాలు చేస్తున్నారు. షర్మిల తో పాటు వైఎస్ సునీతను రెచ్చగొడుతున్నారు.