PM Modi- Jagan And Chandrababu: ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామం. సీఎం జగన్ తో పాటు విపక్ష నేత చంద్రబాబుకు ఢిల్లీకి రావాలని కేంద్ర పెద్దలు ఆహ్వానం పంపారు. డిసెంబరు 5న రాష్ట్రపతి భవన్ లో జరిగే అత్యున్నత స్థాయి సమావేశానికి హాజరుకావాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇరువురి నేతలకు ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు. ఏపీ రాజకీయాలకు సంబంధించి ఇది కీలక పరిణామం. ఇప్పటివరకూ శాసనసభలో తప్ప ఇరువురు నేతలు కలిసింది లేదు. వేదిక పంచుకున్న సందర్భాలు లేవు. తొలిసారి జగన్ తో పాటు చంద్రబాబు వేదిక పంచుకోనున్నారు. గతంలో అజాదీ కా అమృత్ దినోత్సవ వేడుకల నిర్వహణకుగాను నిర్వహించిన సమావేశానికి ఇద్దరు నేతలకు ఆహ్వానం అందింది. కానీ చంద్రబాబు ఒక్కరే హాజరయ్యారు. ఆ సమయంలో సీఎం జగన్ ఢిల్లీలోనే ఉన్నా హాజరుకాలేదు. ఇన్నాళ్లకు మరోసారి ఇద్దరు కలిసే చాన్స్ వచ్చింది.

ఈ ఏడాది జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలు అందుకున్న భారత్.. వచ్చే ఏడాది శిఖరాగ్ర సమావేశాల నిర్వహణకు సిద్ధపడుతోంది. దీనిలో అన్ని రాజకీయ పక్షాలనూ భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది, దేశావ్యాప్తంగా సదస్సులు, సమావేశాలు పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే సెప్టెంబరులో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో నిర్వహించిన 14వ జాయింట్ కమిషన్ సమావేశం సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అదే స్పూర్తితో జీ20 శిఖరాగ్ర సమావేశానికి సన్నాహాలు చేస్తోంది. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపుతోంది. అందులో భాగంగా సీఎం జగన్ తో పాటు చంద్రబాబుకు ఆహ్వానం అందింది. సమావేశానికి యూనైటెడ్ స్టేట్స్ ఎమిరేట్ ప్రతినిధి ప్రత్యేక ఆహ్వినితుడిగా రానున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ జీ20 శిఖరాగ్ర సమావేశం అజెండాపై రాజకీయ పార్టీల అధినేతలతో చర్చించనున్నారు.
అయితే ఈ సమావేశానికి జగన్ తో పాటు చంద్రబాబు తప్పకుండా హాజరయ్యే అవకాశముంది. ఇప్పటికే జగన్ ఢిల్లీ టూర్ షెడ్యూల్ ఖరారైనట్టు తెలుస్తోంది. డిసెంబరు 5న జగన్ ఢిల్లీ చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్ లో జరిగే ఈ భేటీకి హాజరుకానున్నారు. అయితే ఇప్పటికే చంద్రబాబు కూడా సమావేశానికి హాజరయ్యేందుకు నిర్ణయించుకున్నారు. అయితే గత మూడేళ్లుగా కేంద్ర పెద్దలకు దగ్గరయ్యేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలేవీ వర్కవుట్ కాలేదు.

కానీ ఇటీవల ఆయన కేంద్ర పెద్దల నుంచి వరుసగా ఆహ్వానాలు అందుకుంటున్నారు. తొలిసారి గా అజాదీ కా అమృత్ దినోత్సవ సన్నాహాక సమావేశానికి ఆహ్వానం అందడంతో ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీతో సుదీర్ఘ విరామం తరువాత సరదాగా మాట్లాడగలిగారు. అటు తరువాత భీమవరంలో విప్లవ వీరుడు అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానం అందింది. కానీ పార్టీ ప్రతినిధిగా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడ్ని పంపించారు. ఇప్పుడు మూడోసారి జీ20 సమావేశ నిర్వహణకు ఆహ్వానించడంతో.. చంద్రబాబు అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. తన సీనియార్టీని రంగరించి మరీ కేంద్రానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు.