Homeఆంధ్రప్రదేశ్‌Visakha steel plant : విశాఖ స్టీల్ కు భారీ ప్యాకేజీ.. అసలు లెక్క అదేనా!

Visakha steel plant : విశాఖ స్టీల్ కు భారీ ప్యాకేజీ.. అసలు లెక్క అదేనా!

Visakha steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్( Visakha steel plant) ప్రైవేటీకరణ తప్పదని గతంలో కేంద్రం ప్రత్యేక ప్రకటన చేసింది. చివరికి పార్లమెంట్లో సంబంధిత మంత్రి కూడా తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా అదే స్టీల్ ప్లాంట్ కు కేంద్రం సాయం ప్రకటించింది. 11,500 కోట్ల రూపాయల భారీ సాయం ప్రకటించడంతో ఇక ప్రైవేటీకరణ ఉండదని సంకేతాలు ఇచ్చింది కేంద్రం. దీనిపై కేంద్ర మంత్రులు కూడా ప్రైవేటీకరణ లేదని తేల్చేస్తున్నారు. కూటమి పార్టీల నేతలు సైతం దానినే చెప్పుకొస్తున్నారు. అయితే ఈ భారీగా నిధుల కేటాయింపు వెనుక ఒక టార్గెట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కేంద్రానికి హామీ దక్కడం తర్వాతే ప్యాకేజీ ఖరారు అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆర్థిక ప్యాకేజీ పై కార్మిక వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిధుల కేటాయింపుతో ప్లాంట్ యాజమాన్యంతో పాటు కార్మిక వర్గాలపై అసలు బాధ్యత పెంచినట్లు తెలుస్తోంది.

* ఎన్నో రకాల ప్రయత్నాల తరువాత
విశాఖ స్టీల్ ప్లాంట్ కు( Visakha steel plant) 11,500 కోట్ల రూపాయల సాయానికి సంబంధించి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటన చేశారు. ఈ ప్యాకేజీలో 10300 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడతామని.. మిగిలిన మొత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్ రుణంలో ప్రాధాన్యత వాటా మూలధనం గా మార్చుతామని కేంద్ర మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ అప్పు 35 వేల కోట్లు గా ఉందని.. బ్యాంకు రుణాలతో పాటు వడ్డీ, ముడి సరుకు సరఫరాకు సంబంధించి చెల్లింపులు చేయాల్సి ఉంది. తొలుత బ్యాంకర్లతో కేంద్ర ప్రభుత్వం సమీక్షించింది. ప్లాంట్ కు సాయం చేయాలని కోరింది. అందుకు బ్యాంకులో అంగీకరించలేదు. అందుకే ప్రధానమంత్రి కార్యాలయం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో చర్చించింది. ఆర్థిక మంత్రి సూచనలతో ఎస్బిఐ నేతృత్వంలోని కమిటీ ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే ఈ 11500 కోట్ల ప్యాకేజీ ప్రకటన జరిగింది.

* కేవలం ఉత్పత్తి పెంచడమే లక్ష్యం
అయితే స్టీల్ ప్లాంట్( steel plant) ఉత్పత్తి సామర్థ్యం పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి 92.3% ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యమని సమాచారం. రెండేళ్లలో దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సాయాన్ని అందించినట్లు మంత్రి కుమారస్వామి వెల్లడించారు. అంటే ఆగస్టు నాటికి ఆ సామర్థ్యాన్ని నిలబెట్టాలన్నమాట. అయితే దీనిపై కార్మిక వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు ప్యాకేజీ శాశ్వత పరిష్కార మార్గం కాదన్నది వారి అభిప్రాయం. నేరుగా ఆర్థిక సాయం ప్రకటన వెనుక ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనాలు లేవన్నది కార్మిక వర్గాల వాదన.

* ఆర్థిక ప్యాకేజీ తో మనుగడ కష్టం
ఆర్థిక ప్యాకేజీ తో ( financial package )స్టీల్ ప్లాంట్ మనుగడ అసాధ్యమని కామెంట్స్ వినిపిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయింపు అనేది అత్యంత ప్రాధాన్యత అంశంగా తెలుస్తోంది. సెయిల్ లో విలీనం చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. శాశ్వత పరిష్కారాల కోసం కార్మికుల పోరాటం జరుగుతోందని.. ప్యాకేజీ కోసం కాదని కార్మిక సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలకు ప్యాకేజీ ప్రకటించి.. ఆ తరువాత రకరకాల కారణాలు చూపుతూ మూసివేయడం పరిపాటిగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆర్థిక ప్యాకేజీతో ప్రైవేటీకరణ నిలిచిపోయిందని భావించడం భావ్యం కాదని.. ఆగస్టు నాటికి ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగానే ప్లాంట్ భవిష్యత్తు నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version