Shock to MP Uday Srinivas Tangella: ఏపీలో సైబర్ నేరాలకు( Cyber crimes )అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అనునిత్యం ఎక్కడో ఒకచోట సైబర్ నేరం నమోదు అవుతూ వస్తోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ సైబర్ నేరాల బాధితులే. పోలీసులు అనేక రూపాల్లో అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో చలనం లేదు. సైబర్ నేరాల బారిన పడుతూనే ఉన్నారు. మొన్నటికీ మొన్న ఏపీ మంత్రి అల్లుడు ఒకరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారు. లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా కాకినాడ జనసేన ఎంపి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఏకంగా రూ.92.5 లక్షలు కొల్లగొట్టారు. వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ మార్చి ఈ ఘటనకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎంపీ పేరుతో రిక్వెస్ట్
పూర్వాశ్రమంలో తంగేళ్ల ఉదయ శ్రీనివాస్( Kakinada MP tangela Udaya Srinivas ) టీ టైమ్ వ్యవస్థాపకుడు. మొన్నటి ఎన్నికల్లో కాకినాడ నుంచి జనసేన తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే తాజాగా ఈ టైం సిఎఫ్ఓ శ్రీనివాసరావు గంగిశెట్టి కి ఓ సైబర్ మోసగాడు వాట్సాప్ లో కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకుని మెసేజ్ చేశాడు. మొదట ఆగస్టు 22న శ్రీనివాసరావుకు మెసేజ్ పంపాడు. అది తన కొత్త నెంబర్ అని పరిచయం చేసుకున్నాడు. అయితే అది తన బాస్ ఉదయ శ్రీనివాస్ నెంబర్ అని శ్రీనివాస్ నమ్మాడు. ఈ క్రమంలో ఆ సైబర్ మోసగాడు ఎంపీ ఉదయ శ్రీనివాస్ పేరు చెప్పి అత్యవసరంగా డబ్బులు కావాలన్నాడు. కొన్ని వారాలపాటు శ్రీనివాసరావు తో వండర్లా బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పంపమని చెప్పాడు. శ్రీనివాసరావు కూడా తన యజమాని డబ్బులు పంపమని భావించి.. 11 సార్లు ఏకంగా రూ.92.5 లక్షలు అదేవిధంగా ట్రాన్స్ఫర్ చేశారు. అయితే సెప్టెంబర్ 8న ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాసులు సిఎఫ్ఓ శ్రీనివాసరావు కలుసుకోవడంతో అసలు విషయం బయటపడింది. అటువంటి రిక్వెస్ట్ తానేది ఫోన్లో చేయలేదని ఎంపీ చెప్పడంతో సైబర్ మోసానికి గురయ్యానని శ్రీనివాసరావు ఒక నిర్ణయానికి వచ్చారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాదులోని సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సీరియస్ యాక్షన్ లోకి పోలీసులు..
ఎంపీ పేరుతో ఈ మోసం జరగడంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అయితే ఆలస్యంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇప్పటివరకు ఏడు లక్షల రూపాయలను మాత్రమే ఫ్రీజ్ చేయగలిగారు. మిగిలిన డబ్బును వెనక్కి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ డబ్బులు ఎవరి బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లాయో తెలుసుకునేందుకు బ్యాంక్ రికార్డులు, కాల్ డేటా రికార్డులు, ఐపీ అడ్రస్లను పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. సాక్షాత్తు ఒక ఎంపీకి పరిస్థితి వచ్చిందంటే.. సామాన్యుడి దుస్థితి ఏంటన్న ప్రశ్న వినిపిస్తోంది.