Pawankalyan Fan : పవన్ అంటే వ్యసనం. ఒకసారి ఆయనపై అభిమానిస్తే అది పెరుగుతుందే తప్ప తగ్గదు. తగ్గించుకోలేము కూడా. ఎంతలా అంటే ఇక జీవితాతం అతడితో పాటే అభిమానమూ కొనసాగుతుంది. తెలుగు సినీ పరిశ్రమలో విపరీతమైన స్టార్ డమ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్. ఆయన గురించి నిర్మాతలు పడిగాపులు కాస్తారు. సినిమాలు తీసేందుకు దర్శకులు క్యూకడతారు. ఆయన సినిమాలు ప్లాపు, హిట్టులతో సంబంధం ఉండదు.. ఎలా ఉన్నా కలెక్షన్ల పర్వమే. రాజకీయ జీవితం అంతే. రాజకీయంగా అభిమానించిన వారు సైతం అదే విధంగా ప్రేమిస్తారు. ఆయన చర్యలకు ఫిదా అవుతారు.
స్వల్ప పర్యటన నిమిత్తం తిరుపతి వచ్చిన పవన్ ఫ్యాన్స్ అభిమానానికి ఫిదా అయ్యారు. శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ పై ఫిర్యాదుచేసేందుకు తిరుపతి వచ్చిన పవన్ కు ఘన స్వాగతం లభించింది. తిరుపతి పాత విమానాశ్రయంలో దిగిన పవన్ రోడ్డు మార్గం గుండా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. వేలాది మంది జనసైనికుల ర్యాలీ నడుమ పవన్ ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. దారిపొడవునా పూలు చల్లుతూ ఫ్యాన్స్ తన అభిమానాన్ని చాటుకున్నారు. ఏకంగా ఓ అభిమాని భారీ క్రేన్ లో వేలబడుతూ పవన్ కి పూలదండ వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కోరారు. ఎస్పీ పరమేశ్వరరెడ్డికి వినతిపత్రం అందించారు. ఎస్పీని కలిసేందుకు కేవలం పవన్ తో పాటు ఎనిమిది మందికి మాత్రమే అనుమతిచ్చారు. పవన్‌తోపాటు బాధితుడు కొట్టేసాయి, జనసేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జి కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి, శ్రీకాళహస్తి ఇన్‌చార్జి నగరం వినుత, మదనపల్లె ఇన్‌చార్జి రామదాస్ చౌదరితోపాటు అడ్వకేట్లు అమరనారాయణ, కంచి శ్యాములు ఎస్పీని కలిశారు.
పవన్ తిరుపతి పర్యటనకు జన సైనికులు, అభిమానులు భారీగా పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి సోమవారం ఉదయానికే తిరుపతికి చేరుకున్నారు. పవన్ పాత విమానాశ్రయంలోకి అడుగెట్టిన వెంటనే నినాదాలతో హోరెత్తించారు. రోడ్డు మార్గం గుండా భారీ కాన్వాయ్ నడుమ పవన్ బయలుదేరారు. ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో భారీగా పోలీసులు మోహరించారు. జన సైనికులను నిలువరించడం పోలీసులకు కష్టతరంగా మారింది. పవన్ పర్యటన ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.