Jagan (1)
Jagan: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) అధినేత జగన్మోహన్ రెడ్డి తీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్తున్నారు. కీలక నేతలు సైతం గుడ్ బై చెబుతున్నారు. వైసీపీలో ఒక వెలుగు వెలిగిన నాయకులు సైతం తమ స్వార్థం కోసం పార్టీని విడిచి పెడుతున్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీకి భరోసా ఉందని చెప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకోవైపు పార్టీకి దూరమైన నేతల స్థానంలో సీనియర్ నేతలను తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు తటస్తులను ఆకర్షిస్తున్నారు. నిత్యం తాడేపల్లి కార్యాలయంలోనే గడుపుతున్నారు. వ్యూహాలలో నిమగ్నమయ్యారు.
* మారిన వైఖరి
జగన్మోహన్ రెడ్డికి( Jagan Mohan Reddy) ఒక అలవాటు ఉండేది. ఎంతటి పెద్ద అంశం అయినా ఆయన స్పందించేవారు కాదు. తన బదులు సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు ఇతర నేతలను ప్రయోగించేవారు. రాజకీయంగా విమర్శలు చేయాలనుకుంటే ప్రత్యర్ధుల సామాజిక వర్గాలకు చెందిన నేతలతోనే మాట్లాడించేవారు. అయితే అప్పట్లో అధికారంలో ఉండేవారు కాబట్టి చెల్లుబాటు అయ్యేది. ఇప్పుడు మాత్రం కుదిరే పని కాదు. అందుకే జగన్మోహన రెడ్డి నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఒకవైపు పార్టీ కార్యాలయంలో నిత్య సమీక్షలు జరుపుతుండగా.. ఇంకోవైపు సమకాలీన రాజకీయ అంశాలపై స్పందిస్తున్నారు.
* వంశీకి అండగా
గత కొంతకాలంగా వల్లభనేని వంశీ మోహన్( Vallabha neni Vamsi Mohan ) పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. కనీసం ఆయన సొంత నియోజకవర్గం గన్నవరంలో కూడా ఏ కార్యక్రమంలో పాల్గొనడం లేదు. అయితే ఆయన అరెస్టుకు గురయ్యారు. హైదరాబాదులో ఉంటున్న ఆయనను అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. ఈ ఘటనపై స్పందించారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వంశి అరెస్టు జరిగిందని విమర్శించారు. వల్లభనేని వంశీ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరోవైపు కొఠారు అబ్బాయి చౌదరిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహార శైలిని కూడా తప్పుపట్టారు. అబ్బాయి చౌదరి కారు డ్రైవర్ పై చింతమనేని తిట్ల దండకాన్ని కోట్లాదిమంది చూశారని.. అయినా సరే తిరిగి అబ్బాయి చౌదరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి.
* స్వాగతిస్తున్న పార్టీ శ్రేణులు
అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిలో ( Jagan Mohan Reddy) వచ్చిన ఈ మార్పును ఆ పార్టీ శ్రేణులు ఆహ్వానిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే స్వాగతిస్తున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి నేరుగా స్పందించిన దాఖలాలు తక్కువ. కానీ ఇప్పుడు ఆయన మీడియా ముందుకు వస్తున్నారు. వెంటనే ఖండన ప్రకటనలు ఇస్తున్నారు. ప్రస్తుతం మారిన పరిస్థితులకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అభిమానాన్ని చూరగొంటోంది.