https://oktelugu.com/

Godavari : నేల కూలిన సినీ వృక్షం.. ఆ చెట్టు కింద 300 సినిమాల చిత్రీకరణ.. విషాదంలో సినీ అభిమానులు!

ప్రకృతిని ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు. కానీ సహజమైన ప్రకృతి కనిపించడం ఇప్పుడు అరుదు. విపత్తులు, వరదలతో ప్రకృతి ప్రసాదించే ప్రాంతాలు సైతం కనుమరుగవుతున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : August 6, 2024 / 11:36 AM IST

    Godavari district Nidra Ganneru

    Follow us on

    Godavari : గోదావరి జిల్లాల సోయగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. గోదావరి యాసతో తెరపై హంగామా చేసిన చిత్రాలు సూపర్ హిట్ సాధించాయి. తెరపై వినోదాన్ని వడ్డించడంలో గోదావరి పల్లెలు ముందుంటాయి. ఊరంటే నీరు, వ్యవసాయం, మమకారం, జనం సందడి.. వీటన్నింటికీ గోదావరి జిల్లాలే ఆలవాళ్లు. ఒక్క మాటలో చెప్పాలంటే గోదావరి జిల్లాలు సహజ సిద్ధమైన సినీ స్టూడియోలు. అందుకే నిత్యం అక్కడి పల్లెలు సినీ బృందాల సందడితో కళకళలాడుతుంటాయి. గోదావరి జిల్లాలకు గుర్తింపు తెచ్చినది గోదావరి నదీమతల్లి. గోదావరి తీరాల్లో ప్రకృతి సోయగాలకు కొదువలేదు. పర్యాటక ప్రాంతాలకు కొరత లేదు. అక్కడ ప్రతి దృశ్యం ఒక దృశ్య కావ్యమే. అందుకే సినీ సోయగాలకు ఆనవాళ్లుగా మారింది. అవుట్ డోర్ షూటింగ్ అంటే ముందుగా గుర్తొచ్చేది గోదావరి జిల్లాలే. ఆత్రేయపురం, కడియం, దేవీపట్నం, గోకవరం, గుమ్మల్ల దొడ్డి, గూడాల, మారేడుమిల్లి, కోనసీమ.. ఇలా చెప్పుకుంటే ప్రతి ప్రాంతం ఒక ప్రత్యేకత సాధించినదే. ఇక్కడ తీసిన చిత్రాలు బహుళ ప్రేక్షకాదరణ పొందినవే. అయితే రాను రాను గోదావరి జిల్లాలో సినిమాలు చిత్రీకరించే ప్రదేశాలు కనుమరుగవుతున్నాయి. వాటిని సంరక్షించాల్సిన ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి నది తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి. దీంతో పర్యాటక ప్రాంతాలు ప్రమాదంలో పడుతున్నాయి. 300 సినిమాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఓ వృక్షం ఇటీవల నేలకొరిగింది. చరిత్రను చెరిపేసింది.

    * కూలిన 150 ఏళ్ల వృక్షం
    తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం అనే గ్రామం గోదావరి ఒడ్డున ఉంటుంది. ప్రకృతి సోయగానికి పెట్టింది పేరు ఆ తీరం. అక్కడ 150 సంవత్సరాల చరిత్ర కలిగిన నిద్ర గన్నేరు చెట్టు ఉంటుంది. సుమారు 300 సినిమాలకు సంబంధించి సన్నివేశాలను,పాటలను ఇక్కడే చిత్రీకరించారు. 1975లో వచ్చిన పాడిపంటలతో ఈ వృక్షం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.శంకరాభరణం,త్రిశూలం, సీతారామయ్యగారి మనవరాలు.. ఇలా గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలన్నింటిలోనూ ఈ చెట్టు కనిపిస్తుంది.

    * ప్రముఖుల సినిమాల చిత్రీకరణ అక్కడే
    సహజ సిద్ధమైన ప్రకృతిలో సినిమాలు తీయాలన్న అభిరుచి ఉన్న దర్శకులు తెలుగులో కొదువు లేదు. అటువంటి వారిలో బాపు, కె విశ్వనాథ్, కే రాఘవేంద్రరావు వంటి వారు ముందుంటారు. గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలను గోదావిరి జిల్లాలోని ఎక్కువగా చిత్రీకరించారు.నాటి తరం కథానాయకుల నుంచి నేటితరం హీరోల వరకు అందరికీ గోదావరి జిల్లాలు సుపరిచితం.సినీ పరిశ్రమలు గ్రామీణ నేపథ్యం అంటేనే ఉమ్మడి రాష్ట్రంలో ముందుగా గుర్తొచ్చేది గోదావరి జిల్లాలే. అయితే 300 చిత్రాల్లో కనిపించిన ఈ నిద్ర గన్నేరు చెట్టు నేలకొరకడం ఆ ప్రాంతీయులకు మింగుడు పడని విషయం.

    * సంరక్షణలో విఫలం
    సినిమా షూటింగ్ లతో స్థానిక సంస్థలకు ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. కానీ పర్యాటక ప్రాంతాలు, సినీ చిత్రీకరణకు సంబంధించిన ప్రదేశాలను సంరక్షించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. అటు స్థానిక సంస్థల సైతం పెద్దగా పట్టించుకోలేదు.ఈ చెట్టు విషయంలో కూడా అలానే జరిగింది. చెట్టు సంరక్షణ విషయంలో పాలకులు, అధికార యంత్రాంగం శ్రద్ధ చూపలేదు. యాట వరదలకు గట్టు కొద్దికొద్దిగా దిగబడి.. చెట్టు మొదలు రెండుగా చీలిపోయి పడిపోయింది.