AP Pensions: ఏపీలో కూటమి ప్రభుత్వం( AP government ) దూకుడు మీద ఉంది. కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పింఛన్ల ( social pensions )మొత్తాన్ని పెంచింది. గత ఏడు నెలలుగా అందిస్తూ వచ్చింది. కొత్త పింఛన్లు అందించేందుకు సిద్ధపడుతోంది. అంతకంటే ముందే బోగస్ పింఛన్లు తేల్చే పనిలో పడింది. అందుకు సంబంధించి సర్వే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి పింఛన్లలో అనర్హుల ఏరివేత పై దృష్టి పెట్టింది. గత నాలుగు రోజులుగా చేపడుతున్న ఈ సర్వేలో దాదాపు 70 శాతం వరకు పింఛన్లు బోగస్( bogus pensions) అని తేలిపోయింది. దీంతో వారిపై కత్తి వేలాడుతున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా వారి పింఛన్ల తొలగింపునకు ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది.
* దివ్యాంగులకు మూడు కేటగిరిలో
ప్రస్తుతం 14 రకాల సామాజిక పింఛన్లు( social pensions) అందిస్తోంది ప్రభుత్వం. దివ్యాంగులకు సంబంధించి మూడు కేటగిరీల్లో పింఛన్ల పంపిణీ జరుగుతోంది. వైకల్యంతో పాటు మంచానికే పరిమితమైన వారికి పింఛన్ మొత్తం కింద నెలకు పదిహేను వేల రూపాయలు అందిస్తున్నారు. అలాగే పక్షవాతం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు పదివేల రూపాయలు అందిస్తున్నారు. ఇక మిగతా దివ్యాంగులకు సంబంధించి నెలకు 6000 పింఛన్ రూపంలో అందిస్తూ వచ్చారు. అయితే గత వైసిపి ప్రభుత్వ హయాంలో చాలామంది అనర్హులు పింఛన్లు దక్కించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే వాటి తనిఖీకి ప్రత్యేక వైద్య బృందాలను నియమించింది కూటమి ప్రభుత్వం.
* వైద్యుల తనిఖీ
ప్రస్తుతం వైద్యుల బృందం మంచానికి పరిమితమైన పింఛన్ లబ్ధిదారులను తనిఖీ( sarve ) చేస్తోంది. వారి వైద్య పరిస్థితులను, ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటుంది. అయితే అందులో చాలామంది అనర్హులు ఉన్నట్లు గుర్తిస్తోంది ఈ బృందం. మంచానికే పరిమితమైన పింఛన్ లబ్ధిదారులు 24 వేల మంది ఉన్నారు. అయితే తాజాగా చేపడుతున్న వైద్య పరీక్షల్లో కేవలం 20 నుంచి 30 శాతం మంది మాత్రమే అర్హులుగా తేల్చినట్లు తెలుస్తోంది. మరో 40 నుంచి 50 శాతం మంది వైకల్యంతో బాధపడుతున్నా.. 15వేల రూపాయల పెన్షన్ కు మాత్రం అర్హులు కాదని తేలింది. మరో 25 నుంచి 30 శాతం మంది ఎంత మాత్రం ఈ పథకానికి అర్హులు కారని తేలిపోయింది. మరో 20 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ వైద్య తనిఖీలు కొనసాగనున్నాయి. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలకు సంబంధించి వివరాలు యాప్ లో నమోదు చేస్తున్నారు.
* దీర్ఘకాలిక వ్యాధులతో
ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధులతో( long diseases) బాధపడుతూ మంచానికి పరిమితమైన వారికి 15వేల రూపాయల పింఛన్లు అందించాలన్నది లక్ష్యం. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం పెరిగింది. అందుకే పారదర్శకంగా ఈ పింఛన్ల పంపిణీ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ 24 వేల మందికి 15 వేల రూపాయల చొప్పున పింఛన్లు చెల్లించేందుకు ప్రభుత్వానికి నెలకు 36 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అంటే ఏడాదికి 433 కోట్లు అన్నమాట. అంటే ఐదేళ్లకు 2120 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే అనర్హులను తొలగించి.. వారి స్థానంలో అర్హులైన కొత్తవారికి పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అసలు అర్హత లేని 25 శాతం మందిని తొలగిస్తే నెలకు తొమ్మిది కోట్ల రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. అంటే ఏడాదికి 108 కోట్లు ఆదా అవుతాయి. వీలైనంత త్వరగా ఈ సర్వే ప్రక్రియను పూర్తి చేసి అనర్హులపై వేటు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో బోగస్ పింఛనుదారుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.