Anna Canteens: సంక్రాంతి( Pongal) సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకనుంచి గ్రామీణ ప్రాంతాల్లో సైతం అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. పండగ నాటికి 70 అన్న క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించేందుకు ప్రభుత్వం అప్పుడే ఏర్పాట్లు మొదలుపెట్టింది. జనవరి పదిలోగా నిర్మాణాలు పూర్తిచేసి.. జనవరి 13 నుంచి 15 మధ్య ఈ క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటివరకు నగరాలతో పాటు పట్టణాలకే ఈ క్యాంటీన్లు పరిమితం అయ్యాయి. ప్రజలకు మూడు పూటల భోజనం కేవలం 15 రూపాయలకే అందిస్తుండడంతో ఆదరణ పెరిగింది. మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో సైతం క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావాలన్న డిమాండ్ పెరిగింది. అందుకే విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కూటమి వచ్చిన వెంటనే
2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం( Telugu Desam) పార్టీ పేద ప్రజల కోసం అన్న క్యాంటీన్లను తెరిచింది. వైయస్సార్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ క్యాంటీన్లన్నీ మూతపడ్డాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లను తెరిచింది. ప్రస్తుతం పట్టణాల్లో 205 క్యాంటీన్లు ఉన్నాయి. వీటిలో రోజుకు మూడు పూటలా కలిపి 2 లక్షల మందికి పైగా ప్రజలు తక్కువ ధరకే భోజనం చేస్తున్నారు. ఉదయం, రాత్రి టిఫిన్ అందిస్తుండగా.. మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. ఒక్కో పూటకు ఐదు రూపాయల తోనే వీటిని అందిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో విజయవంతమైన ఈ క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఎమ్మెల్యేల నుంచి వచ్చింది. ఆ విన్నపం మేరకు గ్రామీణ ప్రాంతాల్లో క్యాంటీన్లను విస్తరిస్తోంది ఏపీ ప్రభుత్వం.
కోట్లాది మందికి భోజనాలు
అన్న క్యాంటీన్లు( Anna canteens ) అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు.. 3.16 కోట్ల మంది మధ్యాహ్న భోజనం చేసినట్లు తెలుస్తోంది. ఉదయం టిఫిన్ చేసిన వారి సంఖ్య 2.62 కోట్ల మంది గా ఉంది. రాత్రిపూట అల్పాహారంతో పాటు భోజనం చేస్తున్న వారి సంఖ్య 1.42 కోట్లుగా ఉంది. విశాఖ,ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నుంచి అత్యధికంగా పేదలు క్యాంటీన్లకు వచ్చి ఆకలి తీర్చుకుంటున్నారని తెలుస్తోంది. తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని అందించడం ద్వారా ఎంతోమందికి అండగా నిలుస్తున్నాయి ఈ క్యాంటిన్లు.
జిల్లాల వారీగా ఇలా..
కొత్తగా ఏర్పాటు చేయబోయే ఈ క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తారు. ఈ కొత్త క్యాంటీన్లకు సంబంధించి చిత్తూరు ఏడు, గుంటూరుకు ఐదు, శ్రీకాకుళం జిల్లాకు ఐదు, తూర్పుగోదావరి కి నాలుగు, ఏలూరు కు నాలుగు, ప్రకాశం జిల్లాకు నాలుగు, కర్నూలుకు నాలుగు, విజయనగరానికి మూడు, అనంతపురం జిల్లాకు మూడు, అల్లూరి సీతారామరాజు జిల్లాకు మూడు, అనకాపల్లి కి మూడు, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు మూడు, పశ్చిమగోదావరి కి మూడు, కృష్ణాజిల్లా కు మూడు, నెల్లూరు కు మూడు, అన్నమయ్య జిల్లాకు మూడు, కాకినాడకు రెండు, తిరుపతికి రెండు, పార్వతీపురం మన్యం జిల్లాకు 1, పల్నాడుకు ఒకటి, ఎన్టీఆర్ జిల్లాకు ఒకటి, శ్రీ సత్యసాయి జిల్లాకు ఒకటి, నంద్యాలకు ఒకటి, కడప జిల్లాలో ఒక క్యాంటీన్ ఏర్పాటు చేయనున్నారు.