YCP : అధికారం పోయింది.. ఆ పత్రికలో 60 శాతం కోత..? భవిష్యత్తులో ఇంకా ఎన్ని చూడాలో..!

YCP అలా ఉంటేనే అధికార పక్ష అనుకూల మీడియా నుంచి ఆయనను ఆయన కాపాడుకోగలడు. లేకుంటే అంతే సంగతులు. మరి సాక్షిపై జగన్ నిర్ణయం ఎలా ఉందో తెలియాల్సి ఉంది.

Written By: NARESH, Updated On : June 7, 2024 10:01 pm

YCP's defeat

Follow us on

YCP :  అధికారాంతమున చూడాలి అయ్యవారి చిత్రాలు అనే ఓ సామెత ఉంది . అది ఇప్పుడు జగన్, సాక్షి పేపర్ విషయంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఏపీ పగ్గాలు జగన్ చేతిలో ఉన్నప్పుడు పట్ట పగ్గాలు లేకుండా వ్యవహారం సాగిపోయేది. సాక్షికి అడ్డగోలుగా యాడ్స్ వెళ్లిపోయేవి. ఈ యాడ్స్ ఎందుకిస్తున్నారు? దేనికోసం ఇస్తున్నారు? అనే ప్రాథమిక ప్రశ్నలను పూర్తిగా పక్కన పెట్టి ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ సాక్షి సేవలో తరించిపోయింది. ఐదేళ్లలో జాకెట్లకు జాకెట్లు ఇచ్చేసింది. ఇలా వందల కోట్లు తగలేసిందని ఆరోపణలు ఉండేవి. ఇప్పుడు అధికారం పోవడంతో ఒక్కసారిగా సాక్షి యాజమాన్యం కత్తిరింపులకు పాల్పడుతోంది. వాస్తవానికి సాక్షిలో గత కొన్ని సంవత్సరాల నుంచి కొత్త నియామకాలను పూర్తిగా నిలుపుదల చేశారు. అధికారంలో ఉన్నప్పటికీ ఉన్న ఉద్యోగులకు గొప్పగా చెప్పుకునే స్థాయిలో వేతనాలు పెంచలేదు. వేరే ప్రత్యామ్నాయం లేక చాలామంది అందులోనే కొలువులు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడంతో వారిలో ఆందోళన మొదలైంది.

ఏపీలో అధికారాన్ని కోల్పోయి, దారుణమైన ఓటమిని వైసిపి మూట కట్టుకుంది. ఫలితంగా వైసీపీ కరపత్రిక అయిన సాక్షి భవితవ్యం పై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం సాక్షి ప్రింటింగ్ ఆర్డర్లో 60 శాతం కోత విధించారట. పేపర్ వేస్టేజ్ అసలు చేయకూడదని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసిందట. వైసిపి ఘోరంగా ఓడిపోవడంతో వలంటీర్లకు విక్రయిస్తున్న ప్రతుల దగ్గర నుంచి ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు చేసిన ప్రతి కాపీని నిలుపుదల చేశారట. దీంతో సాక్షి సర్కులేషన్ పడిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు సాక్షి పత్రికను వలంటీర్లు, వివిధ ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేసేవి. వీటి కొనుగోలుకు ప్రజాధనాన్నే ఖర్చు చేసే వారట. ఏపీ వ్యాప్తంగా ఉన్న రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు నెలకు 200 చొప్పున ఇచ్చి పేపర్ కొనిపించేవారనే విమర్శలున్నాయి. అంతేకాదు ప్రతి గ్రామంలో, వార్డు సచివాలయంలో రెండేసి పేపర్ల చొప్పున వేసేవారట. కొన్నిచోట్ల ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి మరి పేపర్లు కనిపించే వారట. విశ్వవిద్యాలయాలు, ఇతర చోట్ల కూడా బలవంతంగా పేపర్లు వేయించేవారట. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ ఏపీలో సాక్షి సర్క్యులేషన్ 6 లక్షల లోపు మాత్రమే ఉందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. సాక్షి పేపర్లో వన్ సైడ్ వార్తలు వస్తాయి కాబట్టి.. జేబులో నుంచి డబ్బులు పెట్టి కొనుగోలు చేసే అంత ప్రేమ పాఠకులకు లేదని.. బలవంతంగా దానిని అంటగట్టే వారిని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు..

కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఏపీలో సాక్షి రూపురేఖలు పూర్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సాక్షి పత్రిక సర్కులేషన్ పూర్తిగా తగ్గించిన నేపథ్యంలో.. ప్రస్తుత చందాదారులు రెండు లక్షల లోపు ఉండరని టిడిపి నాయకులు అంటున్నారు. ఇప్పుడు వారి సంఖ్యలో మాత్రమే కాపీలు ప్రింట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ” ఇన్నాళ్లు అడ్డగోలుగా అధికారాన్ని అనుభవించి.. లక్షలకు లక్షల కాపీలు డంప్ చేశారు. ఎలక్షన్ల ముందు వద్దన్నా పేపర్ వేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకే ప్రింట్ ఆర్డర్ తగ్గించారు. రేపో మాపో ఉన్న ఉద్యోగులను కూడా తొలగిస్తారు. అప్పటిక సాక్షి కుప్పకూలడమే మిగులుతుంది. అబద్దాల పునాదులపై ఏర్పడిన సాక్షి ఎప్పటికి నిలబడదని” టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. మరి ఈ ఐదేళ్లలో జగన్ కు సాక్షి కచ్చితంగా అండగా ఉండాలి. అలా ఉంటేనే అధికార పక్ష అనుకూల మీడియా నుంచి ఆయనను ఆయన కాపాడుకోగలడు. లేకుంటే అంతే సంగతులు. మరి సాక్షిపై జగన్ నిర్ణయం ఎలా ఉందో తెలియాల్సి ఉంది.