https://oktelugu.com/

Modi Cabinet 2024: టిడిపికి 4 కేంద్రమంత్రి పదవులు.. తెరపైకి కొత్త పేర్లు?

ముచ్చటగా మూడోసారి ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే గత రెండు ఎన్నికలకు భిన్నంగా ఈసారి తీర్పు వచ్చింది. 2014, 2019లోబిజెపి సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో సొంతంగా మ్యాజిక్ ఫిగర్ రాలేదు.

Written By:
  • Dharma
  • , Updated On : June 9, 2024 / 11:31 AM IST

    Modi Cabinet 2024

    Follow us on

    Modi Cabinet 2024: కేంద్ర క్యాబినెట్ లో టిడిపికి ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయి? ఇద్దరితో సరిపెడతారా? నలుగురికి ఛాన్స్ ఇస్తారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు ఇద్దరికి మాత్రమే మంత్రి పదవులు దక్కుతాయని అంతా భావించారు. కానీ నేషనల్ మీడియాలో మాత్రం టిడిపికి నాలుగు మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం జరుగుతోంది. ఏపీలో టీడీపీకి ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని.. చంద్రబాబు కీలకం కాబట్టి తప్పకుండా నాలుగు మంత్రి పదవులు ఇస్తారని జాతీయ మీడియా అభిప్రాయపడుతోంది.

    ముచ్చటగా మూడోసారి ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే గత రెండు ఎన్నికలకు భిన్నంగా ఈసారి తీర్పు వచ్చింది. 2014, 2019లోబిజెపి సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో సొంతంగా మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో మిత్రులుగా ఉన్న టిడిపి, జెడిఎస్ అవసరం ఏర్పడింది. మరీ ముఖ్యంగా చంద్రబాబు ప్రాధాన్యం పెరిగింది. అందుకే గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేంద్ర పెద్దలు.. ఇప్పుడు అనివార్యంగా మారడంతో చంద్రబాబును దగ్గరకు తీసుకున్నారు. ఇదే ఆదునుగా చంద్రబాబు టిడిపికి వీలైనంత ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

    అయితే తొలుత శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకు క్యాబినెట్ హోదా మంత్రి పదవి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది.కానీ ఇప్పుడు మరో ఇద్దరికి సైతం ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. లోక్సభ మాజీ స్పీకర్ జి ఎం సి బాలయోగి కుమారుడు హరీష్ అమలాపురం ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనకు సైతం చాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. నాడు బాలయోగికి లోక్సభ స్పీకర్ పదవి కేటాయించడంలో చంద్రబాబు కృషి ఉంది. చంద్రబాబు సిఫారసు మేరకు నాడు వాజ్పేయి స్పీకర్ గా బాలయోగికి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన కుమారుడికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా.. ఎస్సీ సామాజిక వర్గాన్ని టిడిపి వైపు తిప్పుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరోవైపు చిత్తూరు ఎంపీ దగ్గు మళ్ల ప్రసాద్ కు సైతం కేంద్ర క్యాబినెట్లో చోటిస్తారని టాక్ నడుస్తోంది. మొత్తానికి అయితే తెలుగుదేశం పార్టీకి నాలుగు మంత్రి పదవులు ఇవ్వడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై మరికొద్ది గంటల్లో క్లారిటీ రానుంది.