Elderly couple farming: ఎరువులు, పురుగు మందుల వినియోగం మోతాదుకు మించడంతో ఆహార ఉత్పత్తులు విషమయంగా మారుతున్నాయి. పెట్టుబడులు పెరిగి సేద్యం రైతులకు లాభసాటి కావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తమకున్న తక్కువ భూమిలో సిరులు పండిస్తున్నారు ఓ వృద్ధ దంపతులు. ఓ 30 సెంట్లు స్థలంలో ప్రకృతి సేద్యంతో కూరగాయలు, పండ్ల రకాలు సాగు చేసి ఏకంగా నెలకు 22 వేల రూపాయల వరకు సంపాదించి ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ దంపతులు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అంశం గా మారింది.
నెలకు రూ.22 వేల ఆదాయం..
పల్నాడు జిల్లా( Palnadu district ) చినరాజు పాలెం గ్రామానికి చెందిన జగన్నాథం దంపతులకు ఏడు పదుల వయసు ఉంటుంది. అయితే తమకున్న 30 సెంట్లు స్థలంలో కూరగాయలతో పాటు రకాలు సాగు చేస్తున్నారు. ఎటువంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి సేద్యంతో మంచి ఫల సాయం తెస్తున్నారు. ఈ వయస్సులో తమకు ఎందుకులే అన్నట్టు వారు విడిచిపెట్టడం లేదు. దంపతులిద్దరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ తోటల్లోనే గడుపుతూ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. సంవత్సరానికి రూ.2.70 లక్షల ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ వయసులో ఎవరిపై ఆధారపడకుండా.. తమ కాళ్లపై తాము నిలబడాలన్నదే వారి లక్ష్యంగా తెలుస్తోంది. ఒంట్లో బలం ఉన్నంతవరకు తాము కష్టపడతామని జగన్నాథం దంపతులు చెబుతున్నారు.
పూర్తిగా సేంద్రియ విధానంతో..
అయితే వీరు ప్రకృతి వ్యవసాయం తోనే సాగు చేయడం విశేషం. ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, కాషాయాల తయారీతో పాటు సొంతంగానే పనులు చేపడుతున్నారు. సహజ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ వృద్ధ దంపతులు. అయితే ఆదర్శ రైతులుగా నిలుస్తున్న ఈ వృద్ధ దంపతులు ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. వ్యవసాయ మేగజైన్లు, యూట్యూబ్ ఛానల్ లలో ఇప్పుడు ఈ వృద్ధ దంపతులే హైలెట్ అవుతున్నారు.