Curry Leaves Business: సాధారణంగా వాడుకుని వదిలేయడానికి.. కరివేపాకును ఉదాహరణగా వాడుతుంటాం. కరివేపాకుల వాడుకుని వదిలేసారంటూ బాధపడుతుంటారు. కానీ అదే కరివేపాకు ఆహారాన్ని రుచిగా మారుస్తుంది. ఆపై ఎన్నో ఔషధ గుణాలను సైతం కలిగి ఉంది. అయితే పెద్దల ఉద్దేశం కూడా అంతే. చూడడానికి చిన్నపాటి ఆకు కానీ.. దాని ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని.. కానీ దానిని తేలిక ఆకుగా తీసుకుంటామన్నది వారి వాదన. కానీ అదే కరివేపాకు ఏపీ రైతులకు కోట్లు తెచ్చిపెడుతోంది. కోట్ల రూపాయల టర్నోవర్ కు కారణం అవుతోంది. విదేశాలకు సైతం ఏపీ నుంచి కరివేపాకు ఎగుమతి అవుతోంది. ఆ కథ ఏంటో తెలుసుకుందాం.
Also Read: ఎల్బ్రస్ శిఖరంపై తానా విశ్వ గురుకులం పతాకం
* రూ.100 కోట్ల టర్నవర్
ఏపీ నుంచి కరివేపాకు ద్వారా 100 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుండడం విశేషం. సాధారణంగా ఇంటి ప్రాంగణంలో, ఇంటి పరిసరాల్లో కరివేపాకు చెట్లను సాగు చేస్తుంటారు. ఒకటి రెండు చెట్లు వేసి ఇంటి అవసరాల కోసం వాడుకుంటారు. కానీ గుంటూరు జిల్లా పెదవడ్లపూడి లో ఎకరాలకు ఎకరాలు సాగు చేస్తున్నారు అక్కడి రైతులు. వాణిజ్య పంటలా సాగు ప్రారంభించి.. క్రమేపి భూములు లీజుకు తీసుకొని సాగు చేయడం మొదలుపెట్టారు. ఎంతలా అంటే ఇతర జిల్లాల్లో సైతం.. ఆ సాగును విస్తరించడం ప్రారంభించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి, పెద్దపప్పూరు లో భారీ విస్తీర్ణంలో సాగవుతోంది కరివేపాకు. ప్రకాశం జిల్లా దర్శి, వైయస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు తదితర ప్రాంతాలతో పాటు పల్నాడు, బాపట్ల, కృష్ణాజిల్లాలో పెద్ద ఎత్తున రైతులు సాగు చేస్తున్నారు.
* మూడు వేల ఎకరాల్లో సాగు
ఏపీకి సంబంధించి ఉద్యానవన శాఖ లెక్కల ప్రకారం 3 ఎకరాల్లో కరివేపాకు సాగవుతుందట. కానీ క్షేత్రస్థాయిలో అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలోనే సాగు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఏడాది పొడవునా కరివేపాకు ఉత్పత్తి అవుతుంది. అయితే ఒక్కో సమయంలో ఒక్కో డిమాండ్ ఉంటుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కరివేపాకు మెట్రిక్ తన్నుకు గరిష్టంగా 30 వేల రూపాయల నుంచి 40 వేల వరకు ధర లభిస్తుంది. మిగిలిన సమయాల్లో మాత్రం పదివేల రూపాయల నుంచి 30 వేల రూపాయల వరకు ఉంటుంది. పంట సాగుకు ఎకరానికి ఏడాదికి లక్ష ఖర్చవుతుంది. దాదాపు 20 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తుంది. రాష్ట్రంలో సాగు చేసే కరివేపాకు గతంలో ముంబై నుంచి ఫ్రాన్స్, జర్మనీ, దుబాయి లకు ఎగుమతి అయ్యేది. అయితే ఇటీవల రసాయనాలు వినియోగిస్తుండడంతో దుబాయ్ కు మాత్రమే ఎగుమతి అవుతోంది. పంట సాగు కోసం ఒక్కసారి విత్తనం నాటితే 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తూనే ఉంటుంది. మొత్తానికైతే అందరూ తీసి పారేసే కరివేపాకు.. ఏపీ రైతులకు మాత్రం కాసులు కురిపిస్తోంది.