AP Elections 2024: ఏపీలో పొలిటికల్ హై టెన్షన్ కొనసాగుతోంది. మరి కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. నిన్నటి సాయంత్రం ఐదు గంటలతో ప్రచార పర్వం ముగిసింది. ప్రస్తుతం అన్ని పార్టీల నేతలు వ్యూహ ప్రతి వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. పోలింగ్నకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు పోలింగ్ సిబ్బంది విధుల్లో చేరారు. పోలింగ్ సామాగ్రితో తమకు కేటాయించిన ప్రాంతాలకు చేరుకుంటున్నారు. మరోవైపు ఈసారి యువ ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది యువ ఓటర్లు తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరే గెలుపోటములను నిర్దేశించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల 30 వేల మంది యువ ఓటర్లు తొలిసారి ఓటు వేయబోతున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా పెద్ద ఎత్తున యువ ఓటర్లు నమోదు అయ్యారు. తొలిసారి ఓటు వేస్తున్న వీరి ప్రభావం ఫలితాలపై ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. వీరిలో ఎక్కువమంది విద్యార్థులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారు కావడం విశేషం. ఇటువంటి వారిలో వలస దారులే అధికం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణాల్లోనే కొత్తగా ఎక్కువమంది ఓటర్లుగా నమోదయ్యారు. దీంతో వీరు ఎవరికి మద్దతు తెలిపితే వారే విజేతలుగా నిలవనున్నారు.
ఇక ఓటరు గణాంకాలు పరిశీలిస్తే రాయలసీమలోని కర్నూలు జిల్లాలో అత్యధిక ఓటర్లు ఉన్నారు. ఉత్తరాంధ్రలోని అల్లూరి జిల్లాలో తక్కువ మంది ఓటర్లు ఉండడం విశేషం. కర్నూలు జిల్లాలో 20 లక్షల 16 వేల 396 మంది ఓటర్లు ఉన్నారు. అల్లూరి జిల్లాలో 7 లక్షల 61 వేల 568 మంది ఓటర్లు ఉన్నారు. 154 నియోజకవర్గాల్లో మహిళలు కీలకం. 70 నియోజకవర్గాల్లో అయితే పురుషుల కంటే ఐదు నుంచి పదివేల వరకు అదనంగా మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి ఏపీలో యువత, మహిళలు ఎటు మొగ్గు చూపితే వారే విజేతలుగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.