
కరోనా కారణంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల పడుతూ సినీ కార్మికులు నానాకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా సగం షూటింగ్ చేసుకున్న సినిమాల నిర్మాతల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పటికే నిర్మాతలు బాగా నష్టపోయారు. మరోపక్క షూటింగ్స్ లేక సినీ కార్మికులు పస్తులు పడుకుంటున్నారు. అందుకే, ఈ కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రతి ఒక్కరూ విధిగా సహకరించాలని రీల్ మహానటి కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లకు విజ్ఞప్తి చేసింది. కీర్తి సురేష్ మాట్లాడుతూ ‘దయచేసి ప్రజలు అనవసరంగా బయటకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. అత్యవసర పనులు ఉంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటపుడు ఖచ్చితంగా డబుల్ మాస్క్ వేసుకునే వెళ్ళండి.
ప్రతి ఒక్కరూ సామాజిక భౌతిక దూరాన్ని పాటించండి. అలాగే కచ్చితంగా ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకుంటూ ఉంటేనే మనం కోవిడ్ నుండి రక్షణ పొందగలం. ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలి. అలాగే ప్రధానంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. కరోనా వైరస్ పై సాగుతున్న యుద్ధంలో విజయం సాధించేందుకు ఉండే అతిపెద్ద ఆయుధం ఒక్క వ్యాక్సిన్ మాత్రమే. కరోనా వైరస్‌పై విజయం సాధిద్దాం’ అంటూ కీర్తి బేబీ చెప్పుకొచ్చింది.