Rohit Reddy Farmhouse Case: గత నెలలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో మాదక ద్రవ్యాల పార్టీ జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. ఈ క్రమంలో ఈ కేసు కు సంబంధించిన అనేకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ కేసులో ప్రధాన నిందితుడు నమిత్ శర్మ.. పోలీసులపై కాల్పులకు పాల్పడ్డాడు. నమిత్ శర్మది ఢిల్లీ. ఇతడు ఒక వ్యాపారి. కృత్రిమ మేధ సహాయంతో ఇతడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఐసీసీ చైర్మన్ జై షా తో ఫోటోలు దిగినట్టు చూపించాడు. వారితో అత్యంత సన్నిహితమైన సంబంధం ఉందని నమ్మించాడు. రోహిత్ రెడ్డితో పరిచయం పెంచుకున్నాడు. అంతేకాదు, ప్రధానమంత్రి పుట్టిన రోజు వేడుకకు హాజరైనట్టు చెప్పాడు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా బయటపెట్టాడు.
నమిత్ శర్మ మాటలను పూర్తిగా నమ్మిన రోహిత్ రెడ్డి పలు సంస్థలలో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. కేవలం రోహిత్ రెడ్డిని మాత్రమే కాకుండా, ఇంకా చాలామంది ప్రముఖులను అతడు తప్పుతోవ పట్టించినట్టు సమాచారం. ఈ కేసును అనేక విడతలుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితులు పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటున్నారు. దానివల్ల ఈ కేసు విచారణలో జాప్యం జరుగుతోంది.
మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ ను పోలీసులు విచారించే అవకాశం కనిపిస్తోంది. విచారణ కు హాజరు కావడానికి అతడు గడువు కోరాడు. దీనికి దర్యాప్తు బృందం అంగీకరించింది. ఈ కేసులో అతని పాత్ర గురించి పోలీసులు మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. అది నిర్ధారణ అయిన తర్వాత.. అసలు ఏం జరిగిందనేది వెలుగులోకి వస్తుందని దర్యాప్తు బృందం అధికారులు చెబుతున్నారు.