Early Morning Dreams: మనకు తెలియకుండానే ఓ వింత లోకంలో విహరించినట్టు.. మనల్ని ఎవరో తీసుకెళ్తున్నట్టు.. అనుకోకుండా విదేశాలకు వెళ్లినట్లు.. ఒక్కోసారి అనుభూతి కలుగుతుంది. కానీ కళ్ళు తెరిచి చూసేసరికి ఉన్నచోటే ఉంటాం. ఇలా నిద్రించే సమయంలో కొన్ని ఆలోచనలు వచ్చి ఆ తర్వాత మటుమాయం అయిపోతాయి. వీటినే కలలు అంటారు. మానవులకు కలలు ఎందుకు వస్తాయి? అనేది పెద్ద రహస్యంగా మిగిలింది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వారు చేసే పనులు ముందుగా తెలియజేయడానికి కలలు వస్తాయని అంటుంటారు. కానీ సైన్స్ ప్రకారం మన జీవితంలో జరిగే సంఘర్షణలు.. మెదడులో దాగి ఉండి తిరిగి నిద్రించినప్పుడు అవి కనిపిస్తాయని అంటారు. అయితే ఉదయం పూట వచ్చిన కలలు నిజం అవుతాయని కొందరు ఆధ్యాత్మిక వాదులు అంటుంటారు. వాస్తవానికి అలా జరుగుతాయా? అసలు ఏంటి మిస్టరీ?
తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతారు. కానీ సైంటిఫిక్ గా దీనికి ఎక్కడ ధ్రువీకరణ కాలేదు. హిందూ సంస్కృతి ప్రకారం ఉదయం 3 గంటల నుంచి సూర్యోదయం అయ్యేవరకు ఉండే కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయాన్ని ఆధ్యాత్మిక సమయం అని పేర్కొంటారు. ఈ సమయంలో వచ్చే కలలు భవిష్యత్తును సూచిస్తాయని.. ఇవి సాక్షాత్తు దేవుడే వారికి దారి చూపుతాడని అంటుంటారు. ఈ ఫలితం 15 రోజుల్లో కనిపిస్తుందని చెబుతారు. అయితే వీటిలో కొన్ని నిజజీవితంలో జరిగాయని చెబుతూ ఉంటారు.
కానీ సైన్స్ శాస్త్రవేత్తలు మాత్రం దీనిని కొట్టిపారిస్తారు. ఎందుకంటే మానవ మెదడులో జరిగే కార్యకలాపాలే కలలుగా మనకు కనిపిస్తాయని.. ఇది భవిష్యత్తు గురించి ఎలాంటి విషయాలు చెప్పదని.. అప్పటివరకు మన జీవితంలో జరిగిన సంఘటనలే మరోసారి చూపిస్తాయని అంటున్నారు. కొంతమంది కొన్ని విషయాలు, దృశ్యాలు చూసినప్పుడు ఆందోళన చెందినా.. భయపడినా.. అవి మెదడులో ఉండిపోయి తిరిగి కలల రూపంలో బయటకు వస్తాయని అంటున్నారు..
మనుషులు నిద్రించినప్పుడు వివిధ దశలోకి వెళ్తారు. ఇందులో తెల్లవారుజామున మెలకువ వచ్చే ముందు ఉండే దశను rapid Eye moment (REM) అని అంటారు. దాదాపు కలలు ఈ దశలోనే ఎక్కువగా వస్తుంటాయి. ఈ సమయంలో మెదడు చురుగ్గా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో భవిష్యత్తు, గతం గురించి చేసిన ఆలోచనలు తిరిగి కనిపిస్తాయి. అయితే ఇవి కేవలం అంచనా మాత్రమే. కచ్చితంగా జరిగినవి కొన్ని మాత్రమే. కలలు ఏ సమయంలోనైనా రావచ్చు. అయితే అప్పటికే భావోద్వేగాలు.. మానసిక ఆందోళనలు.. మానసిక సంఘర్షణలు ఉన్నవారిలో ఎక్కువగా ఉదయం సమయంలో ఆలోచన ఉంటుంది. అందుకే ఈ సమయంలో వచ్చే కలలను నిజమవుతాయని అంటుంటారు. ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తే అవే మళ్ళీ కలలో రూపంలో కనిపిస్తూ ఉంటాయి.
అంతేగాని ఉదయం పూట వచ్చే కలలు నిజం అవుతాయని ఎవరు ధ్రువీకరించలేదు. అయితే కొందరు ఆధ్యాత్మిక వాదులు మాత్రం మనం ఏర్పాటు చేసుకున్న సంకల్పాలు, వాస్తవ జీవితంలో చేయబోయే పనులు ఉదయం పూట కనిపించి సమస్యలు ఉంటే వాటికి పరిష్కారంగా కలలు వస్తుంటాయని అంటున్నారు.