Pawan Kalyan- YCP Kapu Leaders: జనసేననాని పవన్ ఇంట గెలిచి రచ్చగెలవాలనుకుంటున్నారా? ముందుగా సొంతంటిని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? తనపై ఉన్న కుల ముద్ర, ఇరత్రా అంశాలపై స్పష్టతనిచ్చారా? తనపై జరుగుతున్న సామాజిక రాజకీయ కుట్రను బయటపెట్టారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నంలో ఉన్న పవన్ కాస్తా దూకుడు పెంచారు. పార్టీ పదో ఆవిర్భావ సభకు సన్నాహాకంగా జరిగిన సమావేశాల్లో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తనపై జరుగుతున్న కుట్రలను బయటపెడుతున్నారు. ముఖ్యంగా కాపులను కార్నర్ చేసుకొని తనపై జరిగిన రాజకీయ దాడులను చెప్పి జనసైనికులు, కాపులను అప్రమత్తం చేస్తున్నారు. వివిధ పార్టీల్లో ఉన్న సొంత సామాజికవర్గం వారే తనను బలహీనం చేయాలన్న ప్రయత్నాలను ప్రస్తావించి వారిని ఆత్మరక్షణలో పడేశారు.
వాస్తవానికి జనసేన ఆవిర్భావం తరువాత ఆ పార్టీపై కులముద్ర వేశారు. కాపు పార్టీగా అభివర్ణించారు. కానీ అదే సమయంలో కాపులు వివిధ పార్టీలుగా విడిపోయారు. అంతిమంగా అది జనసేనకు నష్టం చేకూర్చింది. అలాగని పవన్ తానెప్పుడు కాపుల పక్షపాతిగా చెప్పుకోలేదు. సమాజంలో అణగారిన వర్గాలు, రాజ్యాధికారం చూడని సామాజికవర్గాలకు పెద్దపీట వేస్తానని చెప్పుకొచ్చారు. కాపుల పల్లకి ఎత్తుకోలేదు. దీంతో కాపుల్లో కూడా పవన్ పై ఒకరకమైన అనుమానం ఉండిపోయింది. తనపై కుల ముద్ర పడకూడదనే పవన్ ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నారు. అయితే ఇప్పుడు నోరు తెరవకుంటే మరింత నష్టం జరిగే చాన్స్ ఉండడంతో కాపు సంక్షేమ సంఘ నాయకుడు హరిరామజోగయ్య సమక్షంలోనే కుండబద్దలు కొట్టేశారు.
ప్రధానంగా కాపుల్లో ఉన్న అనైక్యతను గుర్తుచేస్తూ పవన్ హాట్ కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో కాపులు అసలు తనకు అండగా నిలవలేదన్నారు. అదే జరిగితే కాపులు అధికసంఖ్యలో ఉన్న గాజువాక, భీమవరంలో తాను ఎందుకు ఓడిపోతానని ప్రశ్నించారు. తద్వారా కాపుల్లో ఐక్యత లేదని గుర్తుచేశారు. కాపులు వైసీపీ, టీడీపీ, జనసేనలుగా విడిపోయారని చెప్పారు. తాను నమ్ముకున్న వర్గం ఆదరించలేకపోవడం వల్ల ఓటమి ఎదురైందని చెప్పకనే చెప్పారు. తద్వారా కాపులు ఐక్యంగా ఉంటేనే అనుకున్నది సాధించగలరి ఒక్కి నొక్కానించి చెప్పారు.
అదే సమయంలో కొన్ని అనుమానాలను పవన్ నివృత్తి చేశారు. తనకు అండగా నిలిచే వారికి అన్యాయం చేయనన్నారు. జనసేనను నమ్ముకున్న వారి ఆత్మగౌరవాన్ని తగ్గించనన్నారు. టీడీపీకి అండగా ఉంటూ.. జనసేనను 20 సీట్లకే పరిమితం చేస్తున్నారన్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని విన్నవించారు. లోపయికారీ ఒప్పందాలు అన్నవే ఉండవని తేల్చేశారు. ఒకరికి తగ్గి.. ఒకరి పల్లకి మోసే ప్రసక్తే లేదన్నారు. గౌరవం లేని చోట అస్సలు ఉండనని కూడా చెప్పుకొచ్చారు. తద్వారా కాపుల్లో ఇప్పటివరకూ ఉన్న అనుమానాలను పవన్ తగ్గించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కాపుల్లో ఐక్యత లేకుంటే గత అనుభవాలు పునరావృతమవుతాయని హెచ్చరించారు. అయితే సన్నాహాక సమావేశంతో పాటు రేపు జరిగే ఆవిర్భావ సభలో వైసీపీలోని కాపు నేతలపై టార్గెట్ చేసే అవకాశముంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని ఇతర పార్టీల్లో కాపు నేతలు తనపై వ్యక్తిగత దాడిచేస్తుంటే కాపుల ఐక్యత ఎక్కడుందని ప్రశ్నించడం ద్వారా వారిపై ఒత్తిడి పెంచారు. దీంతో వారు సైలెంట్ కావడమో..,లేకుంటే జనసేన బాట పట్టడమో అన్న ఆప్షన్ లు వారి ముందు ఉంచారని విశ్లేషకులు భావిస్తున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Pawans powerful attack on ycp kapu leaders
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com