Wheat Crisis In Pakistan: ఐఎంఎఫ్ నుంచి విరివిగా అప్పులు తెచ్చుకుంటోంది. అప్పులు తీర్చడానికి విమానాలు అమ్ముకుంటోంది. అమెరికాకు ఆస్తులు తాకట్టు పెడుతోంది. మరోవైపు భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతోంది. కానీ, తమ దేశ ప్రజల బాగోగులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఆర్థిక సంక్షోభం పెరిగి నిత్యావసర ధరలకు రెక్కలు వస్తున్నాయి. దీంతో కొనుగోలు శక్తి లేక ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కిలో గోధుమ పిండి 130 రూపాయలు అయింది. ఇక ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం 25 శాతం పెరిగింది. గోధుమ పిండి కొరత పేదలను రెండు పూటల ఆహారం లేని పరిస్థితికి నెట్టేసింది.
పెరిగిన నిత్యావసర ధరలు..
బహిరంగ మార్కెట్లలో 40 కేజీల గోధుమ ధర 4,600 పాకిస్తానీ రూపాయలకు (సుమారు 2,800 భారతీయ రూపాయలు) చేరింది. కేజీకి 130 రూపాయలు ఖర్చవుతోంది. సాధారణ కుటుంబానికి 10 కేజీలకు 1,300 రూపాయలు అవసరం. గత ఏడాది ధరలు 60% పెరిగాయి. దీంతో పేదలు ఆకలి పట్టుకుని ఉండాల్సి వచ్చింది.
పేదలకు అందని సబ్సిడీ పిండి..
ప్రభుత్వం సబ్సిడీతో పిండి సరఫరా చేస్తోంది. 10 కేజీలకు 910 రూపాయలు, 20 కేజీలకు 1,820 రూపాయలు నిర్ణయించారు. కానీ లాహోరు వెలుపల లభ్యత చాలా తక్కువ. దక్షిణ పంజాబ్ ప్రజలు ఖరీదైన బ్రాండెడ్ పిండిపై ఆధారపడుతున్నారు.
తగ్గుతున్న గోధుమ నిల్వలు..
పాకిస్తాన్ ఫ్లోర్ మిల్స్ అసోసియేషన్ ప్రకారం, వ్యాపారులు, ప్రజల వద్ద గోధుమ స్టాకులు త్వరగా తబ్బిపడుతున్నాయి. రహీమ్ యార్ ఖాన్‌లో 50 లక్షల మంది జనాభాకు ప్రభుత్వ కోటా లేకపోవడం సరఫరాను దెబ్బతీసింది. గత రెండేళ్లుగా 80% మిల్లులు నష్టాల్లో నడుస్తున్నాయి. దిగుమతి గోధుమలపై ఆధారపడటం వల్ల ధరలు మరింత పెరిగాయి.
ఖర్చులు, పంపిణీ లోపాలు..
ఉత్పత్తి ఖర్చుల పెరుగుదల (విద్యుత్, ఇంధన ధరలు), బలహీన పంపిణీ, అధికారుల ఉదాసీనత సమస్యను తీవ్రతరం చేశాయి. పంజాబ్ ప్రభుత్వం తన 15 లక్షల టన్నుల నిల్వల నుంచి జనవరి 20 నుంచి మార్చి 20 వరకు రోజుకు 20–22 వేల టన్నులు విడుదల చేయాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే సంక్షోభం మరింత తీవ్రం అవుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం దిగుమతులు పెంచి, సబ్సిడీలను మెరుగుపరచాలని నిపుణులు సూచిస్తున్నారు.
