Twitter Blue Tick: ట్విట్టర్ ను టేకోవర్ చేసిన ప్రపంచంలోనే నంబర్ 1 ధనవంతుడు ఎలన్ మస్క్ రాగానే ట్విట్టర్ సీఈవో, సీఎఫ్ వో సహా అందులో తనకు వ్యతిరేకంగా పనిచేసిన అందరినీ తొలగించాడు. భారతీయులైన ఇద్దరు ఉన్నతాధికారులను బయటకు పంపారు. ఇక అది చాలదన్నట్టు తాజాగా వినియోగదారులపై మరో పిడుగు వేసింది.

ట్విట్టర్ లో బ్లూటిక్ ఉంటే అది వారి అధికారిక ఖాతాగా ఇన్నాళ్లు ఉండేది. అన్ని రంగాల ప్రముఖులు, సంస్థలకు ఇన్నాళ్లు అధికారికంగా ‘బ్లూటిక్’తో ట్విటర్ ఇలా గుర్తింపునిచ్చేది. కానీ ఎలన్ మస్క్ పగ్గాలు చేపట్టాక సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ట్విటర్ ను ఆదాయ వనరుగా తీర్చిదిద్దేందుకు యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖులు, సంస్థలు ఎలాగైనా సరే డబ్బులు చెల్లించే స్థోమత ఉండడంతో వారిపై పడ్డాడు.
తాజాగా ట్విటర్ యూజర్లకు ఎలన్ మస్క్ గట్టి షాక్ నే ఇచ్చాడు. గత కొన్ని రోజులుగా బ్లూటిక్ సహా అదనపు ఫీచర్లకు పెయిడ్ వెర్షన్ తీసుకొచ్చేందుకు మల్లగుల్లాలు పడ్డ ఎలన్ మస్క్ ఎట్టకేలకు ఈ ఊగిసలాటకు తెరదించాడు. బ్లూటిక్ ఉన్న వారు నెలకు 8 డాలర్లు (రూ.660 పైగా) చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్ లో కన్ఫామ్ చేశారు.
బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ద్వారా ఎక్కువ నిడివి ఉన్న వీడియో/ఆడియోలు పోస్ట్ చేయడం.. స్పామ్ మెసేజ్ లను అరికట్టేందుకు మెన్షన్ అండ్ సెర్చ్ సౌకర్యం వంటి అదనపు ఫీచర్లను ఇస్తామని మస్క్ ప్రకటించారు.
మొత్తానికి ఇన్నాళ్లు ఉచితంగా ట్విట్టర్ ద్వారా తమ సినిమాలు, ప్రొడక్టులు ప్రచారం చేసుకున్న వారంతా డబ్బులు నెలనెలా కట్టాల్సిందేనన్న ఎలన్ మస్క్ ప్రకటన వినియోగదారులు, ప్రముఖులు, సంస్థలకు షాకిచ్చినట్టే. దీని వల్ల చాలామంది ట్విట్టర్ కు బదులుగా ఇతర ఫ్లాట్ ఫామ్ లకు మారే అవకాశాలు కూడా కొట్టిపారేయలేం..