Trump Photo On Dollar: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ 2.0 పాలన అస్తవ్యస్తంగా సాగుతోంది. అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదాలతో ఎన్నికల ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకున్న ట్రంప్.. అధికారం చేపట్టగానే అమెరికా ఫస్ట్ నినాదం వదిలేశాడు. ట్రంప్ ఫస్ట్ అన్న నినాదం ఎత్తుకున్నాడు. తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకు పాకులాడుతున్నాడు. తనను పొగిడే దేశాలతో దోస్తీ చేస్తున్నారు. యుద్ధాలు ఆపానని శాంతి నోబుల్ ప్రైజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అమెరికా 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విడుదలయిన కొత్త ఒక డాలర్ స్మారక నాణెంపై డొనాల్డ్ ట్రంప్ తన చిత్రం ముద్రించుకున్నాడు. ట్రంప్ ముఖచిత్రంతో రూపొందిన ఈ రూపకల్పనలో “”Liberty”, “In God We Trust” పదాలు ఉండడం అమెరికా విలువల ప్రతీకగా భావించవచ్చు. వెనుకభాగంలో ట్రంప్ తన పిడికిలి ఎత్తి చూపుతున్న చిత్రం “Fight Fight Fight” అనే పదాలతో ఇవ్వడం ఆయన రాజకీయ ధోరణిని, ప్రతిఘటన భావాన్ని ప్రతిబింబిస్తుంది.
చట్టపరమైన ఆంక్షలు..
అమెరికా చట్టం ప్రకారం సజీవ వ్యక్తుల ప్రతిమ లేదా ఛాయాచిత్రాన్ని నాణెంపై ముద్రించడం నిషేధం. అంతేకాక, చనిపోయిన తర్వాత కనీసం రెండు సంవత్సరాల తర్వాత మాత్రమే వారు నాణెంపై కనిపించే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం ట్రంప్ చిత్రాన్ని రెండు వైపులా ఉంచడం చట్టవిరుద్ధమయ్యే ప్రమాదం ఉంది.
రాజకీయ ప్రాధాన్యత..
ఇలాంటివి విడుదల కావడం ట్రంప్ అనుచరులకు గౌరవప్రదంగా ఉంటే, విమర్శకులకు ఇది ప్రభుత్వ వ్యవస్థల తటస్థతపై ప్రశ్నలు లేవదీస్తుంది. వైట్‌హౌస్ నుంచి అధికారిక ధ్రువీకరణ లేకపోయినా, ట్రంప్ ఈ రూపకల్పనకు అనుకూలంగా ఉండవచ్చని లోపలి వర్గాలు సూచిస్తున్నాయి.
చారిత్రక సందర్భం..
జీవించి ఉన్న అధ్యక్షుడిని నాణెంపై ఉంచడం అత్యంత అరుదైన విషయం. 1926లో కాల్విన్ కూలిడ్జ్ తరువాత ఇలాంటి ఉదంతం జరగలేదు. అమెరికా స్మారక నాణేల చరిత్రలో ఇది ప్రత్యేక స్థానం పొందే అవకాశం ఉంది. కానీ చట్టబద్ధత అనుమతిస్తే మాత్రమే.
ట్రంప్ డాలర్ నాణెం రూపకల్పన సామాజిక మాధ్యమాల్లో సెన్సేషన్ అయినా, చట్టపరమైన సవాళ్లు, రాజకీయ వైవిధ్యాలు దీని భవిష్యత్తుని సందిగ్ధంలో ఉంచుతున్నాయి. ఇది దేశభక్తి ప్రదర్శనా లేక వ్యక్తిగత పౌరుణ్యానికి గౌరవం ఇచ్చే ప్రయత్నమా అన్నది అమెరికా రాజకీయ చర్చల దిశను నిర్ణయించబోతోంది.