అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారనేది ఇప్పటికే తేలిపోయింది. అమెరికా ఎన్నికలంటే ట్రంప్ గుర్తుకు రాకమానదు. ఇక 2020 ఎన్నికలు గుర్తుకొస్తే ట్రంప్‌ను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. బైడెన్ గతంలో అధ్యక్ష పదవికి ప్రయత్నించి విఫలమయ్యారు. వ్యక్తిగత జీవితంలో అనేక ఆటుపోట్లు, లైంగిక ఆరోపణలు ఎదుర్కొని అంతిమంగా అమెరికా పీఠాన్ని చేరుకున్నారు. దీంతో ఆయన లోపాలన్నీ ఒక్కసారిగా కనుమరుగయ్యాయి.
Also Read: భారతీయుల అమెరికా వ్యామోహం తీరిపోయిందా?
ఇక ట్రంప్ గురించి చెప్పనక్కర్లేదు. అహంకారం, దురుసుతనం, దుందుడుకుతనం, పట్టింపులేని తత్వం, అవివేకం తదితర అవలక్షణాలు ఆయనలో మూర్తీభవించి ఉంటాయి. నాలుగేళ్ల అధికారంలో ఆయన వ్యవహారశైలిని యావత్ ప్రపంచం చాలాదగ్గరగా చూసింది. ఈ లక్షణాలే ఆయనను పరాజయం పాల్జేశాయి. స్వతహాగా పారిశ్రామిక వేత్త అయిన ట్రంప్ కార్పొరేట్ కార్యాలయం నుంచి నేరుగా శ్వేతసౌధాన్ని చేరుకున్నారు. కనీస రాజకీయ అనుభవం లేకపోవడం, మొండిగా ముందుకు సాగి అంతర్జాతీయంగా అభాసుపాలయ్యారు.
Also Read: మళ్లీ మనోళ్ల అమెరికా చూపులు!
నాలుగేళ్లుగా ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణయాల ఆధారంగా ఆయన వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. దాదాపు నిర్ణయాలన్నీ వివాదాస్పదం కావడం గమనార్హం. ముఖ్యంగా యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన కరోనాను ఎదుర్కోవడంలో నిలువెత్తు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఫలితంగా దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఓ అగ్రదేశ అధ్యక్షుడు అయి ఉండి కూడా ట్రంప్ కనీసం మాస్క్ ధరించకుండా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపారు. దేశంలో నిరుద్యోగ సమస్య హద్దులు దాటుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఎన్నికల విషయంలో సంయమనం కోల్పోయి ప్రత్యర్థులపై వాచాలత్వం ప్రదర్శించారు. ఫలితాల అనంతరం కూడా విజేతను అభినందించాలన్న కనీస హుందాతనాన్ని చూపలేకపోయారు.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు
అంతేకాదు.. తన ఓటమిని అంగీకరించకుండా ఎన్నికల సమయంలోనే ఫలితాలపై కోర్టులకు వెళతానని ప్రకటించేశారు. ఎన్నికల వ్యవస్థను చులకన చేశారు. ఫలితాలను ఆమోదిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా హుందాగా వ్యవహరించాలన్న కుమారులు, అల్లుడు కుష్నర్ సూచనలను పెడచెవిన పెట్టారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఒబామా కేర్ పథకాన్ని నిర్వీర్యపరిచి ప్రజల అభిమానానికి దూరమయ్యారు. చివరకు ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలగారు. అయితే ట్రంప్ ఓడిపోయినప్పటికీ గట్టిపోటీ ఇచ్చారు. చివరిదాకా ప్రత్యర్థిని వణికించారు. అయితే.. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడం ద్వారా 2024 ఎన్నికల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంది.