Donald Trump Health Update: కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి మీడియాలో రాని వార్త అంటూ లేదు. అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి ఇప్పటివరకు ట్రంప్ మాట్లాడుతున్న మాటలు.. తీసుకుంటున్న నిర్ణయాలు.. ప్రతిది కూడా సంచలనమే. ఆయన వేసే అడుగు.. మాట్లాడే మాట.. తీసుకునే నిర్ణయం ఇలా ప్రతిదీ ప్రపంచం మీద తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తోంది.
ఇరాన్ యుద్ధం.. వెనిజులా అధ్యక్షుడు అపహరణ.. ప్రపంచం మీద వేసిన సుంకాలు.. అమెరికా నుంచి ఇతర దేశస్తులను బయటికి పంపించిన తీరు.. క్రూడ్ ఆయిల్ బిజినెస్ లో సాగిస్తున్న పెత్తనం ఇలా ప్రతిదీ కూడా ట్రంప్ వ్యవహార శైలిని ప్రపంచం ముందు కొత్తగా చూపిస్తోంది. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో హత్యాయత్నాన్ని ఎదుర్కొన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడా ఇటీవల హత్యాయత్నాన్ని చవిచూశారు. మొత్తంగా ట్రంప్ వల్ల అమెరికాలోనే కాదు అంతర్జాతీయంగా కూడా నిత్యం వివాదాలే.
ట్రంప్ నివాసం ఉండే వైట్ హౌస్ సమీపంలో ఆ మధ్య ఒక వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. సెక్యూరిటీ సిబ్బంది అతడిని అరెస్ట్ చేశారు. ఇక అప్పటినుంచి వైట్ హౌస్ గురించి అంతగా వార్తలు బయటకు రావడం లేదు. అయితే తాజాగా ట్రంప్ కు సంబంధించి ఒక విషయం వెలుగులోకి వచ్చింది. అది కాస్త ఆయన ఆరోగ్య మీద సరికొత్త చర్చకు దారి తీయడం మొదలుపెట్టింది. ట్రంప్ వయసు ప్రస్తుతం 80 సంవత్సరాలు. ఆయన దాదాపు 108 కిలోల బరువు ఉంటారు.
80 ఏళ్ల వయసులో కూడా ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. దేశానికి సేవలందిస్తున్నారు. ఆయనకు వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో వైద్య పరీక్షలు చేశారు. దాదాపు 22 మంది వైద్య నిపుణులు ఆయనకు పరీక్షలు చేశారు. ఈ వైద్య బృందానికి షాన్ బార్సెల్ నాయకత్వం వహించారు. ట్రంప్ చర్మం మీద చిన్న చిన్న మచ్చలు ఇటీవల కనిపించాయి. చైనా నుంచి ఆయన వచ్చిన తర్వాత ఈ పరీక్షలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన వీనస్ ఇన్ సఫిషియన్సీ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కాళ్ళ కింది భాగంలో స్వల్పంగా వాపు కూడా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అయితే ఇవేవీ కూడా ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీయ లేవని వైద్యులు అంటున్నారు.
విపరీతమైన విదేశీ పర్యటనలు.. తరుచుగా కరచాలనం చేయడం వల్ల ట్రంప్ చర్మం మీద మచ్చలు ఏర్పడి ఉంటాయని వైద్యలు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదని వెల్లడిస్తున్నారు.
