Trump defiant decision: సంచలన నిర్ణయాలు, అధికారిక ఉత్తర్వులతో ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు. మిత్రుడు, శత్రువు అనే తేడా లేకుండా అమెరికాకు డబ్బే ముఖ్యం అన్నట్లుగా తన నిర్ణయాలు ఉంటున్నాయి. ఈ క్రమంలో 20 నుంచి 500 శాతం వరకు పలు దేశాలపై టారిఫ్‌లు విధించారు. తాజాగా ఆయిల్ దోపిడీకి తెరతీశారు. వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అపహరించుకెళ్లాడు. ఇప్పుడు ప్రపంచ సంస్థల నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అతి పెద్ద విదేశీ విధానం ఇది. భారత్ నేతృత్వంలోని ఆధునిక సౌర భద్రతా సంఘంతోపాటు మరో 65 అంతర్జాతీయ సంఘాల నుంచి అమెరికా తప్పుకున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ చర్య ద్వారా యుఎస్ ప్రభుత్వం తన ప్రజల ప్రయోజనాలను కాపాడుతూ ప్రపంచం ఏమైతే నాకేంటి అన్నట్లుగా వ్యవహరించారు.
వైదొలగడానికి ట్రంప్ చెప్పిన కారణాలు..
66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా వైదొలగడానికి ట్రంప్ కొన్ని కారణాలు తెలిపారు. యూఎస్ జాతీయ ఆర్థిక, రాజకీయ లక్ష్యాలు ముఖ్యమైనవని పేర్కొన్నారు. ఈ సంఘాలు అమెరికా స్వాతంత్య్రాన్ని, ఆర్థిక పునాదులను బలహీనపరుస్తున్నాయని ఆరోపించారు. ప్రత్యేకంగా, పర్యావరణ లక్ష్యాలు, ప్రపంచవ్యాప్త విధానాల పేరుతో బలవంతంగా అమెరికాపై ఆర్థిక భారం మోపుతున్నట్లు వెల్లడించారు. అమెరికా పౌరుల ఆదాయం నుంచి నిధులు వృథా అవుతున్నట్లు ప్రకటించారు. తాజా నిర్ణయంతో అమెరికా బడ్జెట్‌లో బిలియన్ల డాలర్లు ఆదా అవుతాయని తెలిపారు.
భారత్‌పై ప్రభావం..
సోలార్ అలయన్స్ నుంచి అమెరికా వైదొలగడంతో భారత్ నేతృత్వం ప్రశ్నార్థకంగా మారింది. ఈ సంఘం కాలుష్య దేశాల సౌర శక్తి అభివృద్ధికి కీలకం. అయితే, అమెరికా వైదొలిగినా ఐరోపా, ఆసియా దేశాల మద్దతుతో ఇది కొనసాగవచ్చు. భారత్‌కు ఇది కొత్త భాగస్వాములను కనుగొనే అవకాశం.
ప్రపంచ దేశాలపై ప్రభావం..
ఈ చర్య అంతర్జాతీయ సంస్థల మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది. అయితే చైనా, రష్యా వంటి దేశాలు ఈ ఖాళీని పూరించే అవకాశం ఉంది. అదే సమయంలో అమెరికా స్వతంత్ర విధానం ప్రపంచ వాణిజ్యం, వాతావరణ ఒప్పందాలను మార్పు చేయవచ్చు. ట్రంప్ విధానం అమెరికా ఫస్ట్ అనే సూత్రాన్ని పునరుద్ధరిస్తోంది. ఇది దీర్ఘకాలంలో ఆ దేశ బలాన్ని పెంచవచ్చు కానీ, అంతర్జాతీయ సహకారాలు తగ్గిపోతాయి. ఈ మలుపు ప్రపంచ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని ఆరంభిస్తోంది.