Masood Azhar: పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజర్‌పై బాంబు దాడి జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ దాడిలో అతడు దుర్మరణం చెందినట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. పాకిస్తాన్‌లో కొన్ని నెలలుగా గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో ఉగ్రవాదులు హతమవుతున్నారు. ఈ క్రమంలో మసూద్‌ను కూడా గుర్తు తెలియని వ్యక్తులు లేపేసినట్లు ప్రచారం జరుగుతోంది.
నూతన సంవత్సరం రోజే..
పాకిస్తాన్ భవల్‌పూర్‌లో నూతన సంవత్సరం 2024, జనవరి 1న ఉదయం 5 గంటలకు మసీదు నుంచి బయటకు వస్తున్న మసూద్‌పై బాంబు దాడి చేసినట్లు తెలుస్తోంది. గుర్తుతెలియని వ్యక్తులు మసూద్‌పై దాడిచేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి. అయితే మసూద్ అజర్ మరణ వార్తలపై పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. బాంబు దాడిని కూడా ధ్రువీకరించలేదు. పాక్ అధికారిక పత్రిక అయిన డాన్, ఇతర మీడియా సంస్థల్లోనూ ఈ దాడి గురించి ఎలాంటి కథనాలు రాలేదు.
భారత్‌పై కీలక దాడుల సూత్రధారి
మసూద్ అజర్ పాక్ కేంద్రంగా పని చేస్తున్న జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు అధినేత. ఇండియాలో జరిగిన పలు భయంకరమైనదాడుల్లో కీలక పాత్ర పోషించాడు. 1995లో మసూద్ అజర్‌ను భారత్ అరెస్ట్ చేసింది. అయితే 1999లో విమానం హైజాక్ చేసిన ఉగ్రవాదులు అతడిని భారత ప్రభుత్వం నుంచి విడిపించుకుపోయారు. ఆ తర్వాత అతడు జైషే మహ్మద్ సంస్థను స్థాపించాడు. 2001లో భారత పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడిలో మాస్టర్ మైండ్‌గా వ్యవహరించాడు. 2008లో ముంబయ్‌లో జరిగిన బాంబు పేలుళ్లలోనూ ముఖ్య పాత్ర పోషించాడు. 2019లో జమ్మూకశ్మీర్‌లో పుల్వామాలో సైనికుల కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలోనూ మసూద్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఘటన తర్వాతనే ఐక్యరాజ్య సమితి అతడిని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించింది.
అధికారికంగా ప్రకటించలేక..
అయితే తాజాగా అతడిపై బాంబు దాడి జరిగినట్లు సోసల్ మీడియాలో దృశ్యాలు వైరల్ అవుతున్నాయని తెలుస్తోంది. ఐక్యరాజ్య సమితి మసూద్ అజర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడు పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్నట్లు పేర్కొంది. అయితే మసూద్ అజర్ తమ దేశంలో నివాసం ఉండడం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. అందుకే అతడిపై జరిగిన బాంబు దాడిని అధికారికంగా ప్రకటించడం లేదని తెలుస్తోంది.