Trump tariffs illegal ruling: ప్రపంచ దేశాలన్నీ అమెరికా కోసం త్యాగం చేయాలన్నట్లుగా ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశం దిగుమతి చేసే దేశాలపై 25 శాతం నుంచి 50 శాతం వరకు టారిఫ్‌లు విధించారు. ప్రపంచ వ్యాప్తంగా 90 దేశాలపై టారిఫ్‌లు అమలులోకి వచ్చాయి. మన దేశంపైనా 50 శాతం టారిఫ్ అమలవుతోంది. ఈ టారిఫ్‌లకు వ్యతిరేకంగా కొన్ని దేశాలు ఏకమవుతున్నాయి. మరోవైపు టారిఫ్ వార్ అమెరికాకే నష్టమని ఆ దేశ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. ఇలాంటి తరుణంలో అమెరికా ఫెడరల్ కోర్టు ట్రంప్‌కు షాక్ ఇచ్చింది. అధ్యక్షుడు విధించిన టారిఫ్‌లు చట్ట విరుద్ధమని ప్రకటించింది. ట్రంప్ తన రాజ్యాంగబద్ధమైన అధికారాలను మించి వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. దిగుమతులపై సుంకాలు విధించే అధికారం యూఎస్ కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ట్రంప్ ఆర్థిక విధానాలపై తీవ్ర చర్చను రేకెత్తించింది, ఇది అమెరికా రాజ్యాంగ వ్యవస్థలో అధ్యక్షుని అధికార పరిధిని ప్రశ్నించే సందర్భంగా మారింది.
కాంగ్రెస్ అధికార పరిధి..
అమెరికా రాజ్యాంగం ప్రకారం, వాణిజ్య నియంత్రణ, సుంకాల విధానం కాంగ్రెస్ అధికార పరిధిలో ఉంటుంది(ఆర్టికల్–1, సెక్షన్ 8). ట్రంప్, జాతీయ భద్రత, ఆర్థిక రక్షణ సాకులతో, ఈ అధికారాన్ని ఏకపక్షంగా ఉపయోగించారని ఫెడరల్ కోర్టు గుర్తించింది. 1962 ట్రేడ్ యాక్ట్ సెక్షన్ 232, 1974 ట్రేడ్ యాక్ట్ సెక్షన్ 301 వంటి చట్టాలను ట్రంప్ ఉపయోగించినప్పటికీ, వీటిని అతిగా విస్తరించి, కాంగ్రెస్ ఆమోదం లేకుండా టారిఫ్‌లు విధించారని కోర్టు తీర్పు స్పష్టం చేసింది. ఈ నిర్ణయం, అమెరికా రాజకీయ వ్యవస్థలో అధ్యక్షుని అధికారాలను పరిమితం చేసే చరిత్రాత్మక ఘట్టంగా నిలిచే అవకాశం ఉంది.
అప్పీల్‌కు అవకాశం..
ఫెడరల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ట్రంప్ యుఎస్ సుప్రీం కోర్టుకు అప్పీల్ చేసే అవకాశం ఉంది. సుప్రీం కోర్టులో ట్రంప్ నియమించిన ముగ్గురు జడ్జిలతో కూడిన కన్సర్వేటివ్ బలం ఉన్నందున, ఈ తీర్పు రివర్స్ అయ్యే సంభావన కొంతమేర ఉంది. అయితే, సుప్రీం కోర్టు కూడా ఫెడరల్ కోర్టు తీర్పును సమర్థిస్తే, ట్రంప్ టారిఫ్‌లు చట్ట విరుద్ధమని ధృవీకరణ అవుతుంది, ఇది ఆయన ఆర్థిక విధానాలకు తీవ్ర ఎదురుదెబ్బగా పరిణమిస్తుంది. ప్రస్తుతానికి, టారిఫ్‌లు తక్షణం రద్దయ్యే అవకాశం లేదు, కానీ ఈ చట్టపరమైన సవాలు ప్రపంచ దేశాలకు ఒక ఊరటనిచ్చే అంశంగా ఉంది.
ప్రపంచ దేశాల ఐక్యతకు బలం..
ఈ ఫెడరల్ కోర్టు తీర్పు, ట్రంప్ టారిఫ్‌లకు వ్యతిరేకంగా చైనా, జపాన్, భారత్, వియత్నాం, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా వంటి దేశాల ఐక్యతకు మరింత బలాన్ని చేకూర్చింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో), బ్రిక్స్ సమావేశాలలో ఈ దేశాలు అమెరికా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనే వ్యూహాలను రూపొందిస్తున్నాయి. బ్రిక్స్ దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయ చెలామణి వ్యవస్థను అభివృద్ధి చేస్తూ, అమెరికా ఆర్థిక ఆధిపత్యాన్ని సవాలు చేసే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఈ తీర్పు ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది.