Pakistani University: భారతీయ సంస్కృతి అతి పురాతనమైనది. ఇక మన పురణాలు, ఇతిహాసాలు మనిషి జీవన విధానం నేర్పిస్తాయి. అందుకే భగవద్గీతను భారతీయులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్రమోదీ రష్యన్ భాషలో ముద్రించిన భగవద్గీత పుస్తకం అందించారు. అంతరిక్షంలోకి వెళ్లిన సునీత విలియమ్స్ కూడా తన వెంట భగవద్గీత తీసుకెళ్లారు. భగవద్గీత మత గ్రంథం కాదు.. మన జీవన విధానం. అందుకే ఇప్పుడు ఈ భవగద్గీతను మన శత్రదువేశం పాకిస్తాన్ కూడా అక్కడి విద్యార్థులకు భోదిస్తోంది.
లాహోర్ యూనివర్సిటీల్లో సంస్కృతం కోర్సు..
పాకిస్తాన్‌లోని ప్రముఖ లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ (ఎల్‌యూఎంఎస్) భారతీయ ప్రాచీన భాష సంస్కృతాన్ని భాషా కోర్సుగా ప్రారంభించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దేశ విభజన తర్వాత మొదటిసారిగా ఈ భాష పాఠాలు అందుబాటులోకి వచ్చాయి. మహాభారతం, భగవద్గీత వంటి గ్రంథాల అధ్యయనానికి కూడా సిద్ధమవుతోంది.
డాక్టర్ షాహిద్ రషీద్ కృషి..
ఫార్మన్ క్రిస్టియన్ కాలేజ్ సోషియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ షాహిద్ రషీద్ ఈ మార్పుకు మూలం. అరబిక్, పార్సీ భాషల్లో నిపుణత కలిగిన ఆయన ఏడాది కష్టపడి సంస్కృతం నేర్చుకున్నారు. కేంబ్రిడ్జ్ పండితురాలు ఆంటోనియా రుపెల్, ఆస్ట్రేలియన్ ఇండాలజిస్ట్ మెక్కామస్ టేలర్ వద్ద ఆన్‌లైన్ శిక్షణ పొందారు. మొదట వర్క్‌షాప్‌లు ప్రారంభించి అనూహ్య ఆదరణ పొందారు. 2027 నాటికి పూర్తి కోర్సుగా మార్చేందుకు ప్రణాళిక రూపొందించారు.
పాణిని గ్రామం నుంచి వారసత్వ పునరుద్ధరణ
వ్యాకరణాచార్య పాణిని నివసించిన గంధార ప్రాంతం ప్రస్తుర ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఉంది. ఈ చారిత్రక సంబంధం స్థానికుల్లో భాషా ఆసక్తిని రేకెత్తించింది. ‘సంస్కృతం మతపరమైనది కాదు, దక్షిణాసియా సాంస్కృతిక చిహ్నం‘ అని రషీద్ ఒక్కసారిగా చెప్పారు. భారతదేశంలో ముస్లింలు అరబిక్ నేర్చుకుంటే, పాకిస్తాన్ ముస్లింలు సంస్కృతం నేర్చుకోవడం ద్వారా భాషలు అడ్డంకులు కాకుండా సేతువులుగా మారతాయని ఆయన నమ్ముతున్నారు.
విద్యార్థుల ఆసక్తి..
విద్యార్థులు మొదట భాషను కఠినంగా భావించినా, త్వరలో దాని సౌలభ్యాన్ని అర్థం చేసుకున్నారు. ఉర్దూ భాషలో సంస్కృత ప్రభావం కనుగొని ఆశ్చర్యపోయారు. చాలామంది సంస్కృతం–హిందీల మధ్య తేడా తెలియకపోయినా తెలుసుకున్నారు. మహాభారత థీమ్ సాంగ్ ఉర్దూ అనువాదాలను నేర్చుకుంటున్నారు.
లైబ్రరీలో పురాతన గ్రంథాలు..
పంజాబ్ యూనివర్సిటీలో 1930ల్లో కేటలాగ్ చేయబడిన సంస్కృత ప్రతులు ఉన్నాయి. దేశ విభజన తర్వాత వాటిని విస్మరించినా, ఇప్పుడు స్థానిక పండితుల శిక్షణతో పునరుజ్జీవనం పోసుకుంటోంది. గుర్మాని సెంటర్ డైరెక్టర్ డాక్టర్ అలీ ఉస్మాన్ ఖాస్మి ప్రకారం, 10–15 సంవత్సరాల్లో పాకిస్తాన్‌లో గీతా, మహాభారత పరిశోధకులు ఎదుగుతారు.