Putin Arrest: యూరప్ నుంచి అమెరికా వరకు అన్ని దేశాల అధ్యక్షులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. కొంతకాలంగా ఉక్రెయిన్ దేశంపై దండెత్తుతున్నాడు. కీవ్ లాంటి నగరాన్ని సైతం తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు పుతిన్. ప్రపంచ దేశాలు ఏకమైన సరే.. యూరప్ దేశాలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నా సరే.. అమెరికా రకరకాల ఇబ్బందులు పెడుతున్నా సరే పుతిన్ ఏమాత్రం తగ్గడం లేదు. పైగా పుతిన్ అంతకుమించి అనేటట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఆర్థికంగా ఇబ్బంది కలుగుతున్నప్పటికీ దేశాన్ని సరైన మార్గంలో నడిపిస్తూ ప్రపంచ దేశాలకు సరికొత్త పాఠాలు చెబుతున్నాడు.
పుతిన్ పై ఒత్తిడి తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. అమెరికా అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ రష్యా అధ్యక్షుడు ఏమాత్రం తగ్గడం లేదు. పైగా యుద్ద విధానంలో సరికొత్త రీతిని అమలు చేస్తున్నాడు. భారత్ లాంటి దేశాలకు చమురు అమ్ముతూ తన అవసరాలు తీర్చుకుంటున్నాడు. అంతేకాదు యుద్ధ సామగ్రి విషయంలోనూ పుతిన్ సరికొత్త విధానాలను అవలంబిస్తున్నాడు. బ్రిక్ సమూహాన్ని మరింత బలోపేతం చేయడానికి అడుగులు వేస్తున్నాడు. ఇవన్నీ కూడా అమెరికా సార్వభౌమాధికారానికి చెక్ పెడుతున్నాయి. దీనికి తోడు ఉత్తర కొరియా లాంటి దేశాల సైనిక సహకారాన్ని కూడా పుతిన్ తీసుకుంటున్నాడు. ఆ మధ్య ఉక్రెయిన్ మీద దాడులు చేయడానికి ఉత్తరకొరియా సైనికులను కూడా వాడుకున్నాడు పుతిన్. ఇటీవల అమెరికా అధ్యక్షుడితో భేటీ కూడా అయ్యాడు. అయినప్పటికీ ఉక్రెయిన్ దేశంతో జరిగే యుద్ధంలో వెనక్కి తగ్గేది లేదని పుతిన్ సంకేతాలు ఇచ్చాడు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన నాయకుల జాబితాలో ముందు వరుసలో ఉండే పుతిన్ ఇప్పుడు అరెస్టు అవుతారంటూ ప్రచారం జరుగుతోంది. పుతిన్ పై ఇటీవల ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అతని అరెస్టు జరుగుతుందని ప్రచారం మొదలైంది. త్వరలోనే హంగేరీ వేదికగా పుతిన్ ను అరెస్టు చేస్తారని తెలుస్తోంది. హంగేరీ వేదికగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అవబోతున్నారు. ఆ భేటీ తర్వాత పుతిన్ ను అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే అతడిని అరెస్ట్ చేయబోరని.. అలాంటిది ఉండదని సమాచారం. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు అరెస్టు చేసే అధికారం లేదు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఉన్న సభ్య దేశాలకు మాత్రమే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాగా ఇప్పటికే పుతిన్ కు భద్రత కల్పిస్తామని హంగేరి ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రకారం చూసుకుంటే పుతిన్ అరెస్టు జరగదని తెలుస్తోంది.
పుతిన్ తన వ్యక్తిగత భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడరు. ఇటీవల అమెరికా అధ్యక్షుడితో భేటీ అయినప్పుడు తన మలాన్ని కూడా వెంట తీసుకొని వెళ్లారు. తన ఆరోగ్యం గురించి ఇతర దేశాల సీక్రెట్ సంస్థలకు తెలియకుండా పుతిన్ జాగ్రత్త పడ్డారు. ఇతర దేశాల అధినేతలతో భేటీ అవుతున్నప్పుడు కనీసం అక్కడ పచ్చి మంచినీరు కూడా ముట్టరు పుతిన్. అత్యంత జాగ్రత్తగా ఉండడమే కాదు, కనీసం తనకు సంబంధించిన వెంట్రుకను కూడా అక్కడ వదిలి వెళ్ళడానికి ఇష్టపడరు. అటువంటి పుతిన్ హంగేరి వేదికగా అరెస్టు అవుతారంటే హాస్యాస్పదంగా ఉందని రష్యా మీడియా చెబుతోంది.