Site icon OkTelugu

Khawaja Asif comments on Israel: ఇజ్రాయెల్ పై దారుణం.. మంట పెట్టిన పాక్‌ మంత్రి!.. ఫైర్ అయిన ఇజ్రాయెల్

Pakistan Defence Minister

Pakistan Defence Minister

Khawaja Asif comments on Israel: పశ్చిమాసియా యుద్ధానికి రెండు వారాల విరామం దొరికింది. ఇది తామే చేయించామని పాకిస్తాన్‌ చంకలు గుద్దుకుంటోంది. అయితే.. ఈ సీజ్‌ఫైర్‌లో లెబనాన్‌ అంశంపై స్పష్టత లేదు. దీంతో ఇజ్రాయెల్‌ లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తోంది. సీజ్‌ఫైర్‌ నేపథ్యంలో ఇరాన్‌–అమెనికా ప్రతినిధులు ఇస్లామాబాద్‌లో నేరుగా శాంతి చర్చలు జరుపున్నారు. ఈ తరుణంలో ఊహించని దౌత్యపరమైన వివాదం చెలరేగింది. పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ఇజ్రాయెల్‌పై చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ చర్యలను ఖండిస్తూ ఆయన సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు ఈ ఉద్రిక్తతలకు మూలకారణమైంది.

ఖవాజా ఆసిఫ్‌ సంచలన వ్యాఖ్యలు
లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ ‘జాతి నిర్మూలన‘కు పాల్పడుతోందంటూ ఖవాజా ఆసిఫ్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఇజ్రాయెల్‌ మానవాళికి శాపం. ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరుగుతుండగానే లెబనాన్‌లో మారణహోమానికి పాల్పడుతోంది. అమాయక పౌరులను ఆ దేశం పొట్టనపెట్టుకుంటోంది. తొలుత గాజా, ఆ తర్వాత ఇరాన్, ఇప్పుడు లెబనాన్‌లో రక్తపాతం కొనసాగుతోంది. యూదుల భారాన్ని వదిలించుకునేందుకు పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్‌ దేశాన్ని ఏర్పాటు చేసినవారు నరకంలో కాలిపోవాలని ప్రార్థిస్తున్నా‘ అని ఆయన పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌ను ‘క్యాన్సర్‌ దేశం‘గా అభివర్ణించడం గమనార్హం. ఈ వ్యాఖ్యలపై విదేశీయంగా వ్యతిరేకత రావడంతో ఆయన తాజాగా ఆ పోస్టును తొలగించారు.

ఇజ్రాయెల్‌ తీవ్ర ఆగ్రహం
ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి కార్యాలయం తీవ్రంగా మండిపడింది. ఇజ్రాయెల్‌ నాశనం కావాలంటూ ఖవాజా పిలుపునివ్వడం అత్యంత దారుణమైన చర్యగా పేర్కొంది. కొనసాగుతోన్న శాంతి చర్చల్లో తటస్థ పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్న దేశం నుంచి ఇలాంటి ప్రకటనలు రావడం సహించరానిదని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి గిడియాన్‌ సార్‌ కూడా ఖవాజా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్‌ను క్యాన్సర్‌తో పోల్చడం, దేశ వినాశనానికి పిలుపునివ్వడం అమానుషమైన చర్య అని హెచ్చరించారు. శాంతి చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఒక దేశం నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడంపై ఇజ్రాయెల్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

శాంతి చర్చల నేపథ్యం
అమెరికా–ఇరాన్‌ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో పాకిస్థాన్‌ కీలక పాత్ర పోషించింది. ఈ కాల్పుల విరమణను శాశ్వత శాంతిగా మార్చేందుకు ఇస్లామాబాద్‌ వేదికగా తదుపరి చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌–పాక్‌ మధ్య ఈ దౌత్య వివాదం తలెత్తడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

దౌత్యపరమైన చిక్కులు
ఇస్లామాబాద్‌లో అమెరికా–ఇరాన్‌ చర్చలు జరగాల్సి ఉండగా, ఖవాజా ఆసిఫ్‌ సోషల్‌ మీడియా వేదికగా ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకోవడం పాకిస్థాన్‌కు ఊహించని దౌత్యపరమైన చిక్కును తెచ్చిపెట్టింది. శాంతి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న దేశం నుంచి ఇటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు రావడంపై అంతర్జాతీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్‌ రాయబారి రూవెన్‌ అజార్‌ భారత్‌లో మాట్లాడుతూ, ‘పాకిస్థాన్‌ నమ్మదగ్గ దేశం కాదు‘ అని వ్యాఖ్యానించారు. దక్షిణ లెబనాన్‌లో హిజ్‌బుల్లా ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా తుడిచిపెట్టడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌ అణు కార్యక్రమం, బాలిస్టిక్‌ క్షిపణుల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలని ఇజ్రాయెల్‌ కోరుకుంటోంది.

పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంపై సందేహాలు
ఇరాన్‌–అమెరికా మధ్య యుద్ధం ఆగిపోవడానికి తామే కారణమని పాకిస్తాన్‌ తెగ ప్రచారం చేసుకుంటోంది. అయితే ఇరాన్‌ మాత్రం అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. పాకిస్తాన్‌ ప్రయత్నాలను ప్రశంసిస్తూనే, మధ్యవర్తిత్వాన్ని మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మొదట కాస్త క్రెడిట్‌ ఇచ్చినా, తర్వాత పాకిస్థాన్‌ వాదనలను ఖండించారు. సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్‌ విదేశాంగ మంత్రులకు సైతం ఈ సమావేశానికి ఆహ్వానం వెళ్లినట్లు సమాచారం. 10 పాయింట్ల శాంతి ఒప్పందం ప్రణాళికపై ఈ చర్చల్లో చర్చించనున్నారు.

ఈ దౌత్య వివాదం మధ్యలోనే అమెరికా, ఇరాన్‌ ప్రతినిధి బృందాలు ఇస్లామాబాద్‌కు చేరుకున్నాయి. శుక్రవారం జరగనున్న ఈ చర్చలు విజయవంతమైతే పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొనే అవకాశం ఉంది. అయితే, ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యలు ఈ చర్చలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది వేచి చూడాలి.

Exit mobile version