Crude Oil Shipping Cost Increase: ఇరాన్–అమెరికా మధ్య డీల్ కుదరడంతో హర్మూజ్ తెరుచుకుంది. దీంతో నౌకల రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో ఇక చమురు సంక్షోభం తీరినట్లే అని ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. చమురుధరలు కొంతమేర తగ్గాయి. కానీ ఈ సంతోషం ఆదిలోనే ఆవిరైంది. అనూహ్యంగా చమురుకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. డిమాండ్‌కు అనుగుణంగా ట్యాంకర్లు అందుబాటులో లేకపోవడంతో వాటి ఛార్జీలు భారీగా పెరిగాయి. భారత్‌కు చమురు తీసుకురావడానికి ఒక సూపర్ ట్యాంకర్‌ను బుక్ చేసుకునేందుకు సాధారణ బెంచ్‌మార్క్ రేటు కంటే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువ చెల్లించాల్సి వచ్చింది. దాదాపు 20 లక్షల బ్యారెళ్ల చమురు మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న ఈ ట్యాంకర్‌ను దక్షిణ కొరియాకు చెందిన సినోకోర్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ స్థాయిలో ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
హర్మూజ్ పునరుద్ధరణ..
అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కారణంగా హర్మూజ్ జలసంధిని మళ్లీ వాణిజ్య రవాణాకు తెరిచారు. అయితే యుద్ధకాలంలో ఇరాన్ ఈ మార్గంలో వేలాది సముద్ర గనులు పరిచింది. వాటిని తొలగించే పని ఆలస్యం అవుతుండటంతో నౌకలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. యుద్ధం వల్ల అక్కడే నిలిచిపోయిన వేలాది ట్యాంకర్లు తమ గమ్యస్థానాలకు చేరేందుకు ఇంకా కొన్ని నెలలు పట్టవచ్చని అంచనా.
బీమా ఖర్చులు, ట్యాంకర్ల కొరత
యుద్ధ ప్రమాదం కారణంగా బీమా ప్రీమియంలు భారీగా పెరగడంతో ఖాళీ ట్యాంకర్లు అందుబాటులో ఉండడం కష్టమైంది. ఒప్పందం ప్రకారం 30 రోజుల్లోపు సముద్ర గనులను పూర్తిగా తొలగించకపోతే, రానున్న వారాల్లో ట్యాంకర్ల ఛార్జీలు మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రిఫైనరీలు, వినియోగదారులపై ప్రభావం..
ట్యాంకర్ల ఛార్జీలు పెరగడంతో గల్ఫ్ నుంచి చమురు దిగుమతి చేసుకునే భారత్, చైనా వంటి దేశాల రిఫైనరీలపై అదనపు భారం పడుతోంది. రవాణా ఖర్చులు పెరగడంతో రిఫైనరీలు రిటైల్ ధరలను పెంచే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా, వినియోగదారులకు ఆ ప్రయోజనం త్వరగా చేరే అవకాశం తక్కువగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర నాలుగు నెలల కనిష్ట స్థాయి 76 డాలర్ల వద్ద ఉన్నప్పటికీ, ఈ ఏడాది రెండో అర్ధభాగంలో ధరలు మళ్లీ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు బాగా తగ్గాయి. ఇప్పుడు దేశాలు నిల్వలను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టడంతో డిమాండ్ మళ్లీ పెరగనుంది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఎనర్జీ అంచనా ప్రకారం, రాబోయే నెలల్లో బ్యారెల్ ధర 80 నుంచి 90 డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉంది.
