Site icon OkTelugu

US Iran war: మళ్లీ యుద్ధం తప్పదా

US Iran war

US Iran war

US Iran war: అమెరికా–ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు కొలిక్కి రాలేదు. సీజ్‌ఫైర్‌ మాత్రం కొనసాగుతోంది. శాశ్వతం అగ్రిమెంట్‌ కుదరడం లేదు. అమెరికా షరతులను ఇరాన్‌ అంగీకరించడ లేదు. ఇరాన్‌ కండీషన్లను అమెరికా ఒప్పుకోవడం లేదు. మరోవైపు హర్మూజ్‌పై ఆధిపత్యం కోసం ఇరు దేశాలు పోటీ పడుతున్నాయి. ఇరాన్‌ తీరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇరిటేషన్‌ తెప్పిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వార్నింగ్‌ ఇచ్చారు. మరోవైపు ఇరాన్‌ యూఏఈపై దాడులు ట్రంప్‌కు మరింత కోపం తెప్పిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఇరాన్‌ తన గగన తలాన్ని తాత్కాలికంగా మూసివేయడం మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలను పెంచింది. ఈ చర్య సాధారణ భద్రతా జాగ్రత్త కాకుండా, సైనిక సన్నాహాల సంకేతంగా అంతర్జాతీయ విశ్లేషకులు చూస్తున్నారు.

ఎయిర్‌ స్పేస్‌ ఎందుకు మూసినట్లు?
సోమవారం ఉదయం వరకు ఇరాన్‌ తన ఆకాశ సరిహద్దులను వాణిజ్య విమానాలకు మూసివేసినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం దేశంలోని ప్రధాన విమానయాన మార్గాలను ప్రభావితం చేసి, అంతర్జాతీయ విమానాలు మరల్చడానికి దారితీసింది. ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్‌స్‌(ఐఆర్‌జీసీఈ) ఈ పరిణామాలను దగ్గరగా పర్యవేక్షిస్తూ, ఏ విధమైన దాడికైనా తగిన ప్రతీఘాతం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చర్చలు విఫలమైతే సైనిక చర్యలకు ప్లాన్‌ చేస్తున్నారనే వార్తలు ఇరాన్‌ను అప్రమత్తం చేశాయి. ఇరాన్‌ ఈ చర్య ద్వారా తన భూభాగం పైన ఎలాంటి దాడి జరిగినా బలమైన స్పందన ఇస్తామని స్పష్టం చేసింది.

ఉద్రిక్తతల మూల కారణాలు..
అణు కార్యక్రమం నుంచి హార్ముజ్‌ వరకుప్రస్తుత ఉద్రిక్తతలు ఇరాన్‌ అణు కార్యక్రమం, హార్ముజ్‌ జలసంధి ద్వారా చమురు రవాణా సమస్యలు, గతంలో జరిగిన సైనిక ఘర్షణల నుంచి ఉద్భవించాయి. ట్రంప్‌ పాలన ఇరాన్‌పై కఠిన వైఖరి అనుసరిస్తుండటంతో చర్చలు సానుకూల ఫలితం ఇవ్వడం కష్టంగా మారింది. ఇరాన్‌ తన ఆకాశ ప్రాంతాన్ని మూసేయడం గతంలో కూడా ఇలాంటి ఉద్రిక్తతల సమయంలో చేసిన చర్యలను గుర్తు చేస్తోంది. ఇది విమానయాన సేవలపై మాత్రమే కాకుండా, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోంది. చమురు ధరలు ఇప్పటికే పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం మార్కెట్లను మరింత అస్థిరపరచవచ్చు.

శాంతి చర్చల సవాళ్లు…
ప్రస్తుతం రెండు దేశాల మధ్య మధ్యవర్తుల ద్వారా చర్చలు జరుగుతున్నప్పటికీ, కీలక అంశాలపై అవగాహన ఏర్పడలేదు. ఇరాన్‌ తన రక్షణా సన్నాహాలను బలోపేతం చేస్తుండగా, అమెరికా తన మిత్రదేశాలతో సమన్వయం చేసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఉద్రిక్తతలు మధ్యప్రాచ్యంలో మాత్రమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతాయి. హార్ముజ్‌ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం వెళ్తుంది. ఏ విధమైన ఘర్షణ జరిగినా ధరలు మరింత పెరిగి, ప్రపంచవ్యాప్త ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు.

ఇరాన్‌ ఎయిర్‌ స్పేస్‌ మూసేయడం ఒక సాధారణ భద్రతా చర్య కాదు. ఇది రెండు దేశాల మధ్య కొనసాగుతున్న దీర్ఘకాలిక అపనమ్మకం. ఇది మళ్లీ యుద్ధం తప్పదా అన్న సంకేతాలు ఇస్తోంది. శాంతి చర్చలు విజయవంతం కావాలంటే రెండు వైపులా రాజీలకు సిద్ధపడాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మధ్యప్రాచ్యం మరోసారి అగ్నిగుండంగా మారి, ప్రపంచానికి భారీ ఆర్థిక, మానవీయ నష్టం కలిగించే ప్రమాదం ఉంది. ఈ సమయంలో దౌత్యం యుద్ధానికి మార్గం కాకుండా చూడడం అంతర్జాతీయ సమాజం ముందున్న కీలక సవాల్‌.

 

 

Exit mobile version