iPhone craze among youth: కొత్త ఒక చింత పాత ఒక రోత అంటారు. ఈ సామెత ఐఫోన్ కు కూడా వర్తిస్తుంది. ఆపిల్ కంపెనీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది ఐఫోన్ లో కొత్త కొత్త వెరైటీలను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఇందులో అత్యాధునికమైన టెక్నాలజీ వాడుతోంది కాబట్టి ఈ ఫోన్లు కొనుగోలు చేయడానికి అందరూ ఆసక్తి చూపిస్తుంటారు.
మనదేశంలో సెలబ్రిటీలు, పెద్ద పెద్ద వ్యక్తులు, సినిమా తారలు, క్రికెటర్లు ఐఫోన్ లు కొనుగోలు చేస్తుంటారు. వారి స్థాయికి ఐఫోన్ ధర పెద్ద కష్టం కాదు. చిటికెలో వారు ఐఫోన్ సొంతం చేసుకోగలుగుతారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ యువతరం ఇతరులతో తమను పోల్చుకోవడంతో త్వరగా లగ్జరీ లైఫ్ కు అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా ఐఫోన్ కొనుగోలు చేయడానికి యువత తమ శక్తికి మించి ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లిదండ్రులను డబ్బుల కోసం ఇబ్బంది పెట్టడం.. డబ్బులు ఇవ్వకపోతే యువత ఇష్టానుసారంగా ప్రవర్తించడం.. కొన్ని సందర్భాలలో అత్యంత క్రూరంగా ప్రవర్తించడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వాస్తవానికి ఐఫోన్ వాడినంత మాత్రాన స్టేటస్ సింబల్ పెరగదు. కొత్తస్థాయి రాదు. కానీ యువత తన భావోద్వేగాలను నియంత్రించుకోలేరు కాబట్టి కచ్చితంగా ఐఫోన్ కొనుగోలు చేయాల్సిందే అని అనుకుంటారు. కొందరు యువత ఐఫోన్ కొనుగోలు చేయడం కోసం తల్లిదండ్రుల వద్ద భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. కాలేజీ ఫీజులని.. ఇతర వ్యవహారాలు ఉన్నాయని చెప్పి ఆ డబ్బులతో ఈ ఫోన్ కొనుగోలు చేస్తుంటారు.
ఐఫోన్ కొనుగోలు చేసిన తర్వాత ప్రపంచాన్ని జయించినంత గొప్పగా యువత ఫీల్ అవుతూ ఉంటారు. వాస్తవానికి ఐఫోన్ అనేది స్టేటస్ సింబల్ కాదు. అది కేవలం ఒక లగ్జరీ మాత్రమే. లగ్జరీ అనేది ఆర్థికంగా స్థిరత్వం ఉన్న వాళ్ళు మాత్రమే కోరుకుంటారు. ఎందుకంటే వారి దగ్గర అపరిమితమైన డబ్బు ఉంటుంది కాబట్టి.. దేనికోసమేనా విపరీతంగా ఖర్చు పెడుతుంటారు. ఐఫోన్ విషయంలో ఆ స్థాయిలో ఖర్చు ఉండడానికి కూడా కారణం అది కేవలం లగ్జరీ వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని చేసింది కావడమే. కానీ ఈ విషయం యువతరానికి అర్థం కాదు. ఒకరితో తమను తాము పోల్చుకోవడం వల్ల లగ్జరీకి అలవాటు పడుతున్నారు. చివరికి నష్టపోతున్నారు. సామాజిక హోదా అనేది ఫోన్ ద్వారా రాదు అని.. అది మనకున్న చదువు, వివేకం, ఆలోచనతోనే వస్తుంది అనే విషయాన్ని యువత మర్చి పోతున్నారు. అందువల్లే ఐఫోన్ కోసం కొన్ని సందర్భాల్లో దారుణాలకు కూడా పాల్పడుతున్నారు.