Hamas hostages released: రెండేళ్లుగా హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలకు ఎట్టకేలకు విముక్తి కలిగింది. సోమవారం(అక్టోబర్ 13న) హమాస్ విడుదల చేసింది. ఖాన్ యూనిస్ నుంచి బయలుదేరిన వాహనాల మార్గంగా ఏడుగురు వ్యక్తులు ఇజ్రాయెల్ భూభాగానికి చేరుకున్నారు. వారి కుటుంబాలు, అనుచరుల్లో ఉపశమనం స్పష్టంగా కనిపించింది.
పరస్పర విడుదల ఒప్పందం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితో దిగివచ్చిన హమాస్.. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా హమాస్ బందీలను విడుదల చేయనుండగా, ఇజ్రాయెల్ 2 వేలకుపాగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. హమాస్ తన వద్ద ఉన్న మొత్తం 48 మందిలో జీవించి ఉన్న 20 మందిని గాజాలోని మూడు ప్రాంతాల్లో వివిధ దశల్లో వదిలిపెట్టనుంది.
20 సూత్రాల శాంతి ప్రణాళిక..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక పరిధిలో ఇటీవల ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన మూడో రోజున బందీల విడుదల ప్రక్రియ మొదలైంది.
దీని ద్వారా 2023 అక్టోబరు 7 దాడి తరువాత నెలకొన్న అత్యంత సంక్షోభాత్మక పరిస్థితిలో కొంత ఊరటనిచ్చే వాతావరణం ఏర్పడింది.
తర్వాతి దశలో సవాళ్లు..
మొదటిగా బందీల విడుదల పూర్తవగానే, చర్చలు రెండవ దశలోకి ప్రవేశిస్తాయి. ఇందులో హమాస్ నిరాయుధీకరణ, గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి తగ్గడం వంటి సంక్లిష్ట అంశాలు ఉంటాయి. అమెరికా, ఈజిప్టు, ఖతార్ ఈ చర్చల్లో కీలక మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు.
శాంతి ప్రణాళికలో తమ పాత్రను బలపరచేందుకు, ట్రంప్ ఇజ్రాయెల్, ఈజిప్టును సందర్శిస్తున్నారు. ఆయన జెరూసలెంలో పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తదుపరి ఈజిప్టులో మద్యవర్తి నేతలతో భేటీ అవుతారు. ఈ పర్యటన ద్వారా రెండో దశ చర్చలకు దారితీసే కొత్త దిశలు లభించవచ్చని దౌత్య నిపుణుల అంచనా.