Homeఅంతర్జాతీయంAmerica India Trade Deal: ఊకుంటేనే పని అవుద్ది.. భారత్ విషయంలో అమెరికాకు తత్త్వం బోధపడింది?

America India Trade Deal: ఊకుంటేనే పని అవుద్ది.. భారత్ విషయంలో అమెరికాకు తత్త్వం బోధపడింది?

America India Trade Deal: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన 2.0 పాలనలో ప్రపంచ దేశాలతోపాటు అమెరికన్లనూ ఇబ్బంది పెడుతున్నారు. అమెరికా ఫస్ట్‌ నినాదం పేరుతో అగ్రరాజ్యంతో వ్యాపారం చేసే దేశాలపై టారిఫ్‌లు విధించారు. భారత్‌పైనా 50 శాతం సుంకాలు విధించారు. 25 శాతం దిగుమతులపై, మరో 25 శాతం రష్యా నుంచి రమురు దిగుమతి చేసుకుంటున్నందుకు జరిమానాగా విధించారు. అయితే ట్రంప్‌ ఏం ఆశించారో అది నెరవేరలేదు. ఈ క్రమంలో ట్రంప్‌ సలహాదారులైన పీటర్‌ నవారో, స్కాట్‌ బెసెంట్, హోవార్డ్‌ లుట్నిక్‌ వంటి వారి విమర్శలు బలవంత దౌత్యంగా మారాయి. అయినా భారత్‌ ఇటువంటి దూషణలకు ప్రత్యక్షంగా స్పందించడం మానేసి, వ్యూహాత్మక మౌనాన్ని ఎంచుకుంది. ప్రతీకార సుంకాలు విధించకపోవడం, వాషింగ్టన్‌ మీద బహిరంగ దాడులు చేయకపోవడం ట్రంప్‌ బృందాన్ని పునరాలోచనకు గురిచేసింది. ఈ మార్పు ట్రంప్‌ విదేశాంగ విధానంలో వాణిజ్య ప్రాధాన్యతలతో ఏర్పడిన ఆర్థిక ఒత్తిడి పర్యవసానంగా కనిపిస్తోంది.

ఎస్‌సీవో, బ్రిక్స్‌లో భారత్‌ సమతుల్యత సంకేతాలు..
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌లతో స్నేహపూర్వక కలసిన దృశ్యాలు ట్రంప్‌ను వెనక్కి తగ్గేలా చేశాయి. ఈ కలయికలు భారత్‌కు ప్రత్యామ్నాయ భాగస్వామ్యాలు ఉన్నాయనే సంకేతాన్ని ఇచ్చాయి. ఇది అమెరికా దృష్టిలో భారత్‌ను చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా కూటమి వైపు మొగ్గు చూపిస్తున్నట్లుగా కనిపించింది. బ్రిక్స్‌ వంటి సమూహాలు ప్రపంచ జీడీపీలో 40% పాత్ర వహిస్తూ, ఆర్థిక పరపతిని పెంచుతున్న నేపథ్యంలో భారత్‌ తటస్థ స్థితిని కాపాడుకుంటూ, అమెరికాకు వ్యతిరేకంగా కాకుండా స్వయంప్రతిపత్తిని ప్రదర్శిస్తోంది. ట్రంప్‌ ఈ దేశాల మధ్య ఏకత్వాన్ని పెంచినట్లు అనిపిస్తోంది, ఇది అతని సుంకాల విధానానికి వ్యతిరేక ప్రభావాన్ని చూపుతోంది.

అమెరికా ఒత్తిడికి కొత్త రూపాలు..
చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధించి అమెరికాను ఒత్తిడికి గురిచేస్తోంది. ఇది డ్రాగన్‌ ఆర్థిక ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. రష్యా–ఉక్రెయిన్‌ సంఘర్షణలో అమెరికా తంటాలు పడుతుండగా, భారత్‌ వంటి తటస్థ దేశాలపై ఒత్తిడి పెంచడం తప్పుడు వ్యూహంగా మారింది. ట్రంప్‌–పుతిన్‌ అలస్కా భేటీలు సంక్షోభ పరిష్కారానికి దారి తీయకపోవడం, భారత్‌ను బ్రిక్స్, ఎస్సీఓల వైపు మొగ్గు చూపిస్తోంది. 1970ల నుంచి చైనా ఆర్థిక పురోగతి, సైనిక పోటీలు అమెరికాను ’చైనా షాక్‌’కు గురిచేసినట్లుగా, ప్రస్తురం ట్రంప్‌ విధానాలు భారత్‌తో సంబంధాలను దెబ్బతీసే ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. హైపర్‌సోనిక్‌ వ్యవస్థలు, జలాంతర్గామి సాంకేతికతల్లో చైనా ముందడుగు వేస్తుండగా, అమెరికా స్నేహితులను పక్కనపెట్టడం దాని పోటీ సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది.

సంబంధాల పునరుద్ధరణకు సంకేతాలు..
అంతర్జాతీయంగా భారత్‌ పరపతి పెరుగుతున్న దశలో అమెరికాతో సంబంధాల క్షీణత ఇరుదేశాలకు నష్టకరం. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ బాధ్యతాయుత నాయకత్వం, ప్రవాస భారతీయుల విజయాలు ఈ భాగస్వామ్యానికి బలాన్ని ఇస్తాయి. 50% సుంకాలు ద్వైపాక్షిక బంధాలపై నీలినీడలు కమ్మాయి. ఇటీవలి చర్చలు పునరుద్ధరణకు ఆశాకిరణాలు చూపుతున్నాయి. ట్రంప్‌ మోదీతో మాట్లాడటానికి ఆశాభావం వ్యక్తం చేస్తూ, వాణిజ్య ఒప్పందానికి సానుకూలత చూపారు. భారత్‌ ఎస్‌సీవో వంటి వేదికల ద్వారా స్వయంప్రతిపత్తిని నొక్కిచెప్పుతూనే, అమెరికాను వ్యతిరేకించడం లేదని స్పష్టం చేస్తోంది. అమెరికా కూడా ఇండో–పసిఫిక్‌లో భారత్‌ ముఖ్యత్వాన్ని గ్రహించి, సుంకాలకు మించి విస్తృత అజెండాను ముందుకు తీసుకెళ్లాలని పునరాలోచనలో ఉంది. ఈ గందరగోళం తాత్కాలిక తుపానుగా ముగిస్తే, ఇరుదేశాలు మాటల దాడులను కట్టిపెట్టి, రాజీ మార్గాన్ని ఎంచుకోవాలి.

ట్రంప్‌ విధానాలు వాణిజ్యాన్ని కేంద్రీకరిస్తూ, రక్షణ, సాంకేతికత, వాతావరణ సహకారాల్లో అమెరికా సాఫ్ట్‌ పవర్‌ను బలహీనపరుస్తున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత అమెరికా భౌగోళిక రాజకీయాల్లో మునిగిపోయినట్లుగా, ప్రస్తుతం చైనా ఆర్థిక ఆధిపత్యం, బ్రిక్స్‌ ఏకత్వం అమెరికాను సవాలు చేస్తున్నాయి. భారత్‌ వంటి దేశాలు ఒంటరిగా సవాళ్లను ఎదుర్కోలేని పరిస్థితిలో, బహుళ ద్రవ్యాల సమష్టి కార్యాచరణ అనివార్యమవుతోంది. ట్రంప్‌ ఈ పొరపాటును పునరావృతం చేస్తే, అమెరికా ప్రపంచ తయారీ కేంద్రంగా మారే లక్ష్యం దెబ్బతింటుంది. భారత్‌ అమెరికాతో స్థిరమైన భాగస్వామ్యాన్ని కాపాడుకుంటూ, బ్రిక్స్, ఎస్‌సీవోల ద్వారా సమతుల్యతను నిలబెట్టుకుంటే, ఇండో–పసిఫిక్‌ స్థిరత్వానికి ఇది ఉపయోగకరంగా మారుతుంది. ఇరుదేశాలు వాణిజ్య చర్చలను వేగవంతం చేసి, దీర్ఘకాలిక సహకారాన్ని ప్రోత్సహించాలి, లేకపోతే ట్రంప్‌ విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో కొత్త విభేదాలను రేకెత్తించవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version