Gen Z effect: జన్ జడ్.. ఇటీవల ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జెన్ జెడ్ యూత్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు కొన్ని వార్తా సంస్థలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఈ యువత తమ ప్రభావంతో స్థితిగతులను మార్చి వేస్తున్నట్లు కొందరు మేధావులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రపంచం మొత్తం ఈ జెన్ జెడ్ యూత్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో నేపాల్ రాజకీయాల్లో, బంగ్లాదేశ్ ప్రభుత్వం కూల్చడంలో Gen Z యూత్ ఎక్కువగా ప్రభావం చూపిందని తెలుస్తోంది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన జనసేన సమావేశంలో కూడా ఆ పార్టీ అధినేత మాట్లాడుతూ జెన్ జెడ్ యూత్ పై ఎక్కువగా ఫోకస్ చేయాలని అన్నారు. దీంతో జెన్ జెడ్ ప్రభావం రాజకీయ రంగంలో ఎంత ఉందో అర్థమవుతుంది. అసలు ఈ జెన్ జెడ్ యూత్ అంటే ఎవరు?
1997 నుంచి 2012 వరకు జన్మించిన వారు ఇప్పుడు యవ్వనంలోకి వచ్చారు. వీరిని జెన్ జెడ్ యూత్ అని అంటారు. ఈ యువత ఎక్కువగా సోషల్ మీడియాను ఉపయోగిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాను ఉపయోగించడం మాత్రమే కాకుండా తమ అభిప్రాయాలను వెంటనే వ్యక్తం చేయడం.. సామాజిక పరిస్థితులపై విశ్లేషణ చేయడం.. తప్పు, ఒప్పు ల గురించి చర్చించడం తీవ్రమైంది. ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో సమాజంలో జరిగే పరిస్థితులపై వీరు వెంటనే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. అంతేకాకుండా ఎక్కడ ఏ చిన్న విభిన్న పరిస్థితి ఏర్పడిన దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. ఇలాంటి యూత్ వల్ల ప్రస్తుత ప్రపంచ పరిస్థితులపై ఎక్కువగా ప్రభావం పడుతుందని అంటున్నారు.
గతంలో నేపాల్ లో యూట్యూబ్ కంటెంట్ పై పరిమితులు విధించడంపై యువత పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం తెలిసిందే. వీరి ఆందోళనతోనే అక్కడి ప్రధాని దేశం విడిచి వెళ్లిపోయిన పరిస్థితి ఏర్పడింది. అంటే సాధారణ ఉద్యమాలకు భిన్నంగా వీరి ఆందోళన తీవ్రతరంగా ఉంటుంది. ర్యాలీలు, సమావేశాల ద్వారా మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా వీరి ఉద్యమాన్ని ఉదృతం చేస్తారు. ఒక సమాచారాన్ని చాలామందికి చేరవేయడంలో వీరి పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ లోను అలజడి రేపిన యువత జెన్ జెడ్ యువతదే ఎక్కువ అని అంటున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ నిర్వహించిన జనసేన సమావేశంలోనూ జెన్ జెడ్ యూత్ పై ఎక్కువగా ఫోకస్ చేయాలని అభిప్రాయపడ్డాడు. వచ్చే ఆవిర్భావ సభలో జెన్ జెడ్ థీమ్ తో నిర్వహించాలని అన్నారు. వీరిని ఉపయోగించుకోవడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసుకోవచ్చని అన్నారు. ఇప్పటికే జనసేన పార్టీకి సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నారు. వీరికి ఎక్కువగా ప్రాధాన్యతమిస్తే పార్టీ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నట్లు చెప్పారు. అయితే వచ్చే రోజుల్లో కూడా వీరి ప్రభావం మరింతగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.