Elon Musk COVID vaccine comments: కోవిడ్.. ఈ పేరు వింటే ఇప్పటికీ చాలా మంది ఒళ్లు జలదరిస్తుంది. 2019 నుంచి 2022 వరకు ప్రపంచాన్ని మొత్తం కుదిపేసిందీ వైరస్. ఆర్థికంగా, అభివృద్ధి పరంగా, విద్యారంగం పరంగా ప్రపంచం ఒక దశాబ్దం వెనక్కు వెళ్లింది. కోట్లాది మందిని ఈ వైరస్ పొట్టన పెట్టుకుంది. దీనిని నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు హడావుడిగా వ్యాక్సిన్ రూపొందించాయి. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఇప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. కానీ తయారీ కంపెనీలు మాత్రం ఆ ప్రభావాలకు వ్యాక్సిన్ కారణం కాదంటున్నాయి.
మస్క్ సంచలన వ్యాఖ్యలు..
తాజాగా ప్రపంచ కుభేరుడు.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొవిడ్ వ్యాక్సిన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫైజర్ మాజీ టాక్సికాలజిస్ట్ డాక్టర్ హెల్ముట్ స్టెర్జ్ జర్మనీ పార్లమెంటులో చేసిన వాదనను మస్క్ సమర్థించారు. ఏప్రిల్ 12న ఎక్స్ (ట్విట్టర్)లో ఆయన పోస్ట్ చేస్తూ, ‘టీకా డోసేజ్ చాలా ఎక్కువగా ఉంది. దాన్ని ప్రజలకు పలుమార్లు ఇచ్చారు. వ్యాక్సిన్ రాకముందు నాకు వైరస్ సోకింది, కానీ అది భయంకరంగా లేదు. కానీ రెండో టీకా తీసుకున్నప్పుడు నేను చనిపోతున్నట్లుగా అనిపించింది‘ అని పేర్కొన్నారు.
డాక్టర్ స్టెర్జ్ వాదనలు ఇలా..
2007లో ఫైజర్‌ను విడిచిపెట్టిన మాజీ టాక్సికాలజిస్ట్ డాక్టర్ హెల్ముట్ స్టెర్జ్ 2026 మార్చి 19న జర్మనీ పార్లమెంటు కమిషన్ ముందు సాక్ష్యమిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మందికి ఇచ్చిన కామిర్నటీ(ఫైజర్–బయోఎన్‌టెక్ mRNA వ్యాక్సిన్)కు ఆమోదం ఇచ్చే ముందు పది అత్యవసర ప్రీక్లినికల్ ట్రయల్‌స నిర్వహించలేదని ఆరోపించారు. గర్భధారణ, సంతానోత్పత్తిపై వ్యాక్సిన్ ప్రభావాన్ని పరీక్షించే అధ్యయనాలు సరిపోవని విమర్శించారు. జర్మనీ డ్రగ్ సేఫ్టీ వాచ్‌డాగ్ పాల్–ఎర్లిచ్–ఇనిస్టిట్యూట్ నమోదు చేసిన 2,133 మరణాల డేటాను అమెరికా గణాంక పద్ధతికి అనుగుణంగా లెక్కిస్తే, జర్మనీలో 10 వేల నుంచి 60 వేల మంది వరకు మరణాలు వ్యాక్సిన్ వల్ల జరిగి ఉండవచ్చని అంచనా వేశారు. mRNA వ్యాక్సిన్‌కు అసలు ఆమోదం తెలపకూడదని ఆయన తేల్చి చెప్పారు.
పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
ఐసీఎంఆర్, ఢిల్లీ ఎయిమ్స్ సంయుక్తంగా 19 రాష్ట్రాలు, 47 ఆసుపత్రుల్లో సుదీర్ఘ అధ్యయనం నిర్వహించాయి. ఈ అధ్యయనంలో కోవిడ్ వ్యాక్సిన్‌కు, ఆకస్మిక గుండెపోటు మరణాలకు ఎటువంటి సంబంధం లేదని తేలింది. జీవనశైలి, ముందుగా ఉన్న అనారోగ్య సమస్యలే (మధుమేహం, హైపర్‌టెన్షన్, ఊబకాయం) ఈ మరణాలకు ప్రధాన కారణాలని నిర్ధారించారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో కోవిడ్–19 వైరస్ సోకడం వల్ల మయోకార్డిటిస్ (గుండె కండరాల వాపు) రావడానికి అవకాశం, వ్యాక్సిన్ వల్ల రావడానికి అవకాశం కంటే 10 రెట్లు ఎక్కువ అని తేలింది. ఫ్రాన్స్‌లో 18 నుంచి 59 ఏళ్ల వయసు గల వ్యక్తులపై 4 ఏళ్ల పాటు నిర్వహించిన అధ్యయనంలో, mRNA వ్యాక్సిన్ తీసుకున్న వారికి, తీసుకోని వారికి మరణాల రేటులో గణనీయమైన తేడా లేదని తేలింది.
ఫైజర్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు ఇవీ..
కోర్టు కేసుల్లో వెలుగుచూసిన ఫైజర్ వ్యాక్సిన్ తీవ్ర దుష్ప్రభావాలు ఇలా ఉన్నాయి. కార్డియోమయోపతి (గుండె కండరాల వ్యాధి), తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం, ఇంజెక్షన్ సైట్ వాస్కులైటిస్, మూర్ఛలు, అనాఫిలాక్టిక్ షాక్, గుండె వైఫల్యం, మధుమేహం (డయాబెటిస్), హెమోలిటిక్ అనీమియా, ఎంబాలిక్ సెరిబ్రల్ ఇన్ఫారక్షన్. అయితే ఇవన్నీ అత్యంత అరుదైన సంఘటనలు. లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినా, తీవ్ర దుష్ప్రభావాలు చాలా తక్కువ శాతం మందిలోనే కనిపించాయి
ఎలాన్ మస్క్ వంటి ప్రభావవంతమైన వ్యక్తుల వ్యాఖ్యలు ప్రజల్లో ఆందోళన కలిగించవచ్చు. అయితే, శాస్త్రీయ ఆధారాలు, అధికారిక అధ్యయనాలు వ్యాక్సిన్ సురక్షితమని, ప్రయోజనకరమని నిరూపించాయి. వ్యక్తిగత అనుభవాల ఆధారంగా సార్వత్రిక నిర్ధారణలు చేయడం శాస్త్రీయంగా సరైన పద్ధతి కాదు.
