China Iran relations conflict: పశ్చిమాసియా యుద్ధం ప్రస్తుతం ఆగింది. మంగళవారం జరిగే రెండో విడత చర్చలపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు రెండు వారాల సీజ్‌ఫైర్ గడువు 24 గంటల్లో ముగియనుంది. చర్చలు ఫలవంతం అయ్యేందుకు చైనా సహకారం అందిస్తోంది. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ ఇటు అమెరికా, అటు చైనా సహకారంతో ఇరాన్–అమెరికా మధ్య శాంతి కుదర్చాలని చూస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ఇంతకాలం నమ్మిన మిత్రుడిగా నటించిన చైనా.. చివరకు ఇరాన్‌కు షాక్ ఇచ్చింది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ తమ భూభాగానికి చెందినదని ప్రకటించింది. నౌకల రాకపోకలకు అనుమతి, టోల్ వసూలు హక్కు ఉందని చెప్పుకుంది. అమెరికా నావికా దిగ్బంధం వల్ల చైనా సరకు నౌకపై కాల్పులు జరిగి, చైనా ఆందోళన పెరిగింది.
అంతర్జాతీయ జలమార్గంగా ప్రకటన..
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తొలిసారిగా హర్మూజ్ కీలక ప్రకటన చేశారు. హర్మూజ్‌ను అంతర్జాతీయ జలమార్గంగా ప్రకటించి ఇంతకాలం నమ్మిన ఇరాన్‌కు ద్రోహం చేశాడు. ఈ నీటి మీద సాధారణ నౌకాయానాన్ని తెరిచి ఉంచాలని. ఇరాన్ వెంటనే జలసంధిని తెరవాలని సూచించారు. ఈ విషయంలో శాంతిని పునరుద్ధరించడానికి దోహదపడే అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇస్తామని, తక్షణ, సమగ్ర కాల్పుల విరమణను చైనా సమర్థిస్తుందని పేర్కొన్నారు. దే సమయంలో, చైనా అధ్యక్షుడు సౌదీ క్రౌన్ ప్రిన్స్‌తో టెలిఫోన్ సంభాషణల్లో హార్మూజ్ తెరవడం, దౌత్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించిన తర్వాత ఇదే చైనా తొలి ప్రత్యక్ష ప్రకటన.
చైనాపై హార్మూజ్ మూసివేత ప్రభావం..
హార్మూజ్ జలసంధి ద్వారానే ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతానికిపైగా చమురు రవాణా జరుగుతోంది. ఈ మార్గం మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆసియాలో ఇంధన కొరత నెలకొంది. ధరల ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 100–120 డాలర్లకు పెరిగాయి. చైనాకు గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఆయిల్ మొత్తంలో దాదాపు 50 శాతం హార్మూజ్ గుండానే రావాల్సి ఉంటుంది. మార్గం మూసివేత లేదా ఎక్కువ సమయం ఆటంకాలు ఉంటే, చైనాకు రోజుకు లక్షల బ్యారెల్స్ సరఫరా ఆగిపోయే ప్రమాదం ఉందని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇంధన ధరల పెరుగుదల చైనా పరిశ్రమలపై నేరుగా ప్రభావం చూపుతోంది. ప్లాస్టిక్‌లు, ప్యాకేజింగ్, రసాయనాలు, విద్యుత్ ఉత్పత్తి మొదలైన అన్ని రంగాల్లో ఖర్చులు పెరుగుతున్నాయి. దీని వల్ల చైనా జీడీపీ వృద్ధి రేటు 1 శాతం వరకు తగ్గే అవకాశ ఉంది. గల్ఫ్ దేశాలతో చైనా వాణిజ్యం సుమారు 50 శాతం తగ్గింది. ఎగుమతులు, దిగుమతులు రెండూ ప్రభావితమవుతున్నాయి. బిలియన్ల డాలర్ల వ్యాపార నష్టం జరుగుతుంది.
హార్మూజ్‌పై ఆధారాన్ని తగ్గించేందుకు చైనా కొన్ని ముఖ్య వ్యూహాలను అమలు చేస్తోంది. రష్యా–చైనా మధ్య సైబీరియా నుంచి ఆయిల్, గ్యాస్ నేరుగా సరఫరా అయ్యే పైప్‌లైన్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. అలాగే మధ్య ఆసియా దేశాలు కజకిస్తాన్, తుర్కమిస్తాన్ నుంచి గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఇవి చమురు, గ్యాస్ సరఫరాలో హార్మూజ్ ఆధారాన్ని గణనీయంగా తగ్గుస్తున్నాయి. రష్యా నడుస్తున్న ‘నార్దర్న్ సీ రూట్‘ ద్వారా చైనాకు ఎల్‌ఎన్‌జీ, కొంత ఆయిల్ సరఫరా పెరుగుతోంది. ఈ మార్గం హార్మూజ్, మలక్కా వంటి సంక్షిప్త ప్రాంతాలను తప్పుకుని ప్రత్యామ్నాయంగా పనిచేస్తోంది. అయినా చైనా అవసరాలు తీరడం లేదు. దీంతో జిన్‌పింగ్ చేసిన ప్రకటన ఇప్పుడు కీలకంగా మారింది.