India- China: చైనా మారదు. తన తీరు మార్చుకోదు. డ్రాగన్ ఎలాగైతే పరాన్న జీవో.. చైనా కూడా పరాన్న దేశమే. టిబెట్, శ్రీలంక, పాకిస్తాన్.. ఇలా చైనా బారిన పడిన ప్రతీ దేశం కూడా కకావికలమైంది. పేరుకే కమ్యూనిస్టు దేశం కానీ.. పాలనలో ప్రతి పోకడ నియంతృతంగానే కనిపిస్తుంది. ప్రజాస్వామ్య హక్కులను కాల రాయటం, ప్రజలను ఇబ్బంది పెట్టడంలో చైనా తీరుగా ఏ దేశము సరిరాదు. మొన్నటికి మొన్న మూడో వేవ్ కరోనా ప్రబలిన సమయంలో అంత పెద్ద బీజింగ్ నగరానికి తాళం వేసింది. జనాలను ఇలా నుంచి బయటికి రాకుండా నరకం చూపింది. కోవిడ్ నియంత్రణ ఏమో గానీ… వేలాది మంది ఆకలితో చనిపోయారు. ఇక ఆక్రమించడంలో ఆరి తేరిన చైనా.. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులోని గ్రామాలను తన భూభాగంలో ఉన్నట్టుగా చూపించుకుంటున్నది. సున్నితమైన అంశాలను తెరపైకి తీసుకువచ్చి భావోద్వేగాలను రెచ్చగొడుతోంది. నెహ్రూ భారత ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో కుదుర్చుకున్న అలీన ఉద్యమ స్ఫూర్తికి గండి కొడుతోంది.

సరిహద్దుల్లో నిత్యం కవ్వింపులే
భారతదేశ సరిహద్దుల్లో చైనా ఎప్పుడూ కవ్వింపులకు పాల్పడుతూనే ఉంది. హిమాలయాల పొడవునా అక్రమ నిర్మాణాలు చేపడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. లడఖ్ సమీపంలో ఇటీవల చైనా ఓ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఈ విషయం శాటిలైట్ ఫోటోలు ద్వారా బహిర్గతం అయింది. డ్రాగన్ దురాగతాన్ని అమెరికా ఆర్మీ పసిఫిక్ కమాండింగ్ జనరల్ గా ఉన్న చార్లెస్ ఎఫ్లిన్ ప్రపంచానికి తెలిపారు. “లడక్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా జరుపుతున్న నిర్మాణాలు కళ్ళు బైర్లు కమ్మే స్థాయిలో ఉన్నాయి. డ్రాగన్ విధానాలు ఆసియా పసిఫిక్ ప్రాంతానికి ఏమాత్రం ప్రయోజనం కాదని” ఆయన అభిప్రాయపడటం పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తోంది.
Also Read: MP Raghu Rama Krishnam Raju: పార్లమెంట్ లో రఘురామ కితకితలు
గల్వాన్ లోయలో గాయి గాయి
ఈ ఏడాది తొలి రోజునే గాల్వన్ లోయలో చైనా జాతీయ జెండా ఎగిరింది. ఇది తీయాన్మాన్ స్క్వెర్ మీద ఎగిరిన జెండా అంటూ చైనా అధికార ప్రతినిధి వీడియోతో పాటు ట్వీట్ చేయడం గమనార్హం. దీనిని భారత దేశ విదేశాంగ శాఖ తోసి పుచ్చినప్పటికీ చైనా ఆధీనంలోని ప్రాంతంలో ఈ జెండా ఎగిరితే ఆ దేశ అధికార ప్రతినిధి అంత ఉత్సాహంగా ఆ వీడియో పోస్ట్ చేయడం ఎందుకో అని విపక్షాల అనుమానం. భారతదేశాన్ని నిత్యం ఏదో ఒక వివాదంతో, వ్యాఖ్యతో గిల్లుతూ ఉండాలని చైనా సంకల్పించుకున్నట్టుంది. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో 15 ప్రాంతాలకు చైనా తన పేర్లు పెట్టుకుంది. ఈ 15 ప్రాంతాలను దక్షిణ టిబెట్లోని తన అంతర్గత భూభాగాలుగా చైనా సమర్ధించుకుంది. అసలు మొత్తం అరుణాచల్ ప్రదేశ్ ను చైనా తన అధికారిక మ్యాపుల్లో దక్షిణ టిబేట్ గా పేర్కొన్న విషయం తెలిసిందే. నాలుగేళ్ల క్రితం కూడా చైనా ఇదే తరహాలో వాస్తవాలకు మసిపూసే ప్రయత్నం చేసింది. 2017 లో దలైలామా అరుణాచల్ ప్రదేశ్ ను సందర్శించడంపై ఆగ్రహించిన చైనా.. ఆరు ప్రాంతాలకు తన పేర్లు పెట్టింది. ఇప్పుడు మరింత పెద్ద జాబితాతో ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలను ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చుట్టేసే రీతిలో నామకరణం జరిపింది. 11 జిల్లాలు, 8 పట్టణాలు, నాలుగు పర్వతాలు, రెండు నదులు కూడా ఇందులో ఉన్నాయి.
ఈ ప్రకటన ఎందుకు వెలువరించిందంటే
వాస్తవానికి అరుణాచల్ ప్రదేశ్ లో అపారమైన ఖనిజాలు, విస్తారమైన అరుదైన వృక్షాలు, 365 రోజులు పారే నదులు ఉన్నాయి. అడవుల్లో దొరికే అరుదైన మూలికలు క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో ఉపయోగపడతాయి. పైగా అరుణాచల్ ప్రదేశ్ నమోదయ్యే వర్షపాతం దేశ సగటు కన్నా ఎక్కువ. అక్కడ ప్రవహిస్తున్న నదులపై ఆనకట్టలు కడితే కరువును శాశ్వతంగా నిరోధించవచ్చు. ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక చైనా కన్ను అరుణాచల్ ప్రదేశ్ పైన పడింది. ఈ ఏడాది ఒకటి నుంచి చైనాలో భూ సరిహద్దు చట్టం అమల్లోకి వచ్చింది. అందులో భాగంగానే ఈ పేర్ల మార్పిడి ప్రకటన వెలువడింది. 2001 మార్చిలో ప్రతిపాదించిన ఈ చట్టం ఏడు నెలల్లో ఆమోదం పొందింది. అక్టోబర్ 23న చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ దీనికి తలుపగానే అధ్యక్షుడు జిన్ పింగ్ ఆమోదముద్ర వేశారు. చైనా ప్రభుత్వ సంస్థ వ్యవస్థలు దేశ భూభాగాన్ని పరిరక్షించేందుకు బలంగా కట్టుబడి ఉండాలని ఈ చట్టం పిలుపునిస్తున్నది. ఈ చట్టం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పుడే భారతదేశం తన నిరసనను తెలిపింది. ఉన్న వివాదాల పరిష్కారమే కష్టం అవుతున్న నేపథ్యంలో ఈ ఏకపక్ష చట్టం సరిహద్దు సమస్యలను మరింత జటిలం చేస్తుందని భారత్ వాదన. ఇప్పటికే తనతో చేసుకున్న సరిహద్దు ఒప్పందాల మీద దీని ప్రభావం ఉండదని డ్రాగన్ చెబుతున్నప్పటికీ, ఏకపక్ష చట్టం ద్వారా సరిహద్దు సమస్య మరింత జటిల మవుతుందని భారత్ వాదిస్తోంది.

వాస్తవానికి చైనా రెండేళ్లుగా ఎంతో దూకుడుగా సరిహద్దుల వెంబటి చొచ్చుకొని వస్తున్నది. సరిహద్దులను, ఆధీన రేఖలను తనకు అనుగుణంగా తిరగ రాసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నది. సరిహద్దు వివాదాల పరిష్కారానికి సైనిక స్థాయిలో, దౌత్య పరంగా ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో చైనా ఈ నామకరణ కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం. ఇప్పటివరకు భారత్ తో 20 విడతల చర్చల్లో పెద్దగా జరిగిన పురోగతి ఏమీ లేకపోయినప్పటికీ సరిహద్దుల్లో శాంతి కొనసాగించే విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. అయితే కొత్త చట్టంతో చైనా ఎన్ని వీరంగాలైనా చేయవచ్చు. దేశ సరిహద్దుల పరిరక్షణ పేరిట సైనిక చొరబాట్లు జోరుగా జరిపి చర్చల విషయాన్ని పక్కన పెట్టవచ్చు. చైనా ఆధీనంలో ఉన్న వివాదాస్పద ప్రాంతాల నుంచి ఉపసంహరణలు కష్టం కావచ్చు అని విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డ్రాగన్ దేశానికి అదే స్థాయిలో బదులు ఇవ్వకపోతే భారతదేశం మునుముందు అరుణాచల్ ప్రదేశ్ ను పూర్తిగా కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయితే తన అర్థ బలం అంగ బలంతో ప్రపంచాన్ని శాసిస్తున్న చైనా.. ఇతర దేశాలలో ఆక్రమించేందుకు పన్నాగాలు పన్నుతోంది. ఈ క్రమంలో డ్రాగన్ కు అడ్డుకట్ట వేయాలంటే దౌత్య విధానమే సరైనదని భారత్ అభిప్రాయపడుతోంది. ఇప్పటికే చైనా కావింపులపై ఐక్యరాయ సమితికి పలుమార్లు ఫిర్యాదు చేసిన భారత్.. డ్రాగన్ దేశాన్ని ఏకాకిని చేసేందుకు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలతో జతకట్టింది. మరోవైపు జపాన్ అండతో క్వాడ్ కూటమిలో బలమైన దేశంగా ఎదిగింది. మున్ముందు కూడా చేయనా కట్టడి చేసేందుకు మరిన్ని ప్రయత్నాలను భారత్ చేసే అవకాశం కనిపిస్తోంది.
Also Read:Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో వైసీపీ.. రిస్కు వెనుక రీజన్ ఇదే…