American Technology: పెళ్లంటే నచ్చి చేసుకునే వేడుక. పిల్లలు అంటే మోయాలనిపించే బరువు.. అందువల్లే మన దేశంలో వివాహ వ్యవస్థ ఇంత బలంగా ఉంది. బయట ప్రపంచంలో వివాహ వ్యవస్థ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ.. మనదేశంలో కూడా విడాకులు పెరిగిపోతున్నప్పటికీ.. ఇప్పటికీ కూడా వివాహ వ్యవస్థ బలంగానే ఉంది. దీనికి కారణం మన సమాజం లో విలువలు ఉండడమే. అయితే ఇప్పుడు ఈ వివాహన్నే కొన్ని దేశాలు సీక్రెట్ ఆపరేషన్ కోసం ఉపయోగించుకుంటున్నాయి.
నేటి కాలంలో శత్రువుల రహస్యాలు తెలుసుకోవాలంటే కొన్ని దేశాలు చిత్రచిత్రమైన పద్ధతులను అవలంబిస్తున్నాయి. శత్రుదేశాలలో పనిచేసే యుద్ధ రంగ నిపుణుల దగ్గర నుంచి రహస్యాలు సేకరించడానికి వలపు వలలు ప్రయోగించేవారు. అందమైన మహిళలను ఎరగా వేసి.. వారి ద్వారా రహస్యాలను తెలుసుకునేవారు. ప్రత్యర్థుల రహస్యాలను తెలుసుకోవడానికి కాలంతోపాటు అనేక కొత్త కొత్త విధానాలను అమలు చేస్తున్నారు. అమ్మాయిలకు లొంగని వారిని డబ్బులు చూపించి తమ దారిలోకి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ విధానాలు కూడా పాతదిగా మారిపోయాయి. ఎందుకంటే సాంకేతికతకు కొత్త అర్థం చెప్పే సిలికాన్ వ్యాలీ ప్రాంతంలో ఒక కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ విధానానికి “సె* వార్ ఫేర్” అనే పేరు పెట్టారు. ఇది అక్కడి కంపెనీల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వివిధ సంస్థల రహస్యాలను తెలుసుకోవడానికి చైనా, రష్యా వంటి దేశాలు దీనికి తెరలేపినట్టు తెలుస్తోంది.
వలపు వలలో ముందుగా అందమైన అమ్మాయిలు తమ అందచందాలను ఎరగా వేస్తుంటారు. ఆ తర్వాత రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కొందరైతే రహస్యాలతో పాటు డబ్బులు కూడా డిమాండ్ చేస్తుంటారు. ఆ తర్వాత వారు మాయమవుతారు. అందమైన అమ్మాయిలు టార్గెట్ ప్రజలతో కలిసి ఉన్నప్పుడు వాటిని వీడియో తీస్తారు. ఆ వీడియోలను బయటపెడతామని బెదిరించి డబ్బులు లేదా రహస్యాలను చెప్పాలని డిమాండ్ చేస్తారు. అయితే ఇతర ఆపరేషన్లు చేయడంలో చైనా, రష్యన్ ఆపరేటర్లు సిద్ధహస్తులు. అయితే ఇప్పుడు వలపువలలో సరికొత్త విధానాన్ని ఈ రెండు దేశాల ఆపరేటర్లు అనుసరిస్తున్నారు. వలపు వల విసరడం మాత్రమే కాదు.. ఆ మహిళలతో ఆ వ్యక్తులకు పెళ్ళి కూడా చేస్తున్నారు.. పిల్లలను కనేలా ప్రోత్సహిస్తున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా రహస్యాలు తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత పిల్లల్ని వదిలేసి విడాకులు తీసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు.
అమెరికన్ ఐటి నిపుణులను టార్గెట్ చేస్తూ చైనా, రష్యా ఇటువంటి విధానాలకు పాల్పడుతున్నాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చైనాలో పెట్టుబడి పెట్టే కంపెనీల అధిపతులు ఇటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలని పా మిల్ కన్సల్టింగ్ చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జేమ్స్ మాల్వెనన్ హెచ్చరించాడు. ఈ తరహా మోసాన్ని తాను ఇటీవల స్వయంగా చూసినట్టు ప్రకటించాడు. అందమైన అమ్మాయిలనుంచి సోషల్ మీడియాలో అభ్యర్థనలు పెరిగిపోవడమే ఎందుకు నిదర్శనం అని అతను పేర్కొన్నాడు. అదే కాదు ఇటీవల కాలంలో వర్జీనియా ప్రాంతంలో ఓ వ్యాపార సమావేశం జరిగింది. ఆ సమావేశానికి అనుమతి లేకుండానే ఇద్దరు అందమైన చైనీస్ అమ్మాయిలు ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది ముందుగానే గుర్తించి వారిని వెనక్కి పంపించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సమాచారం వారి దగ్గర ఉండడాన్ని వ్యాపారస్తులు నమ్మలేకపోతున్నారు. ఇటీవల కాలంలో ఓ సున్నితమైన ప్రాజెక్టులో అమెరికా దేశానికి చెందిన స్పేస్ ఇంజనీర్ కు భాగస్వామ్యం ఉంది. అయితే అతడి నుంచి రహస్యాలు తెలుసుకోవడానికి ఓ రష్యన్ మహిళ అందచందాలను ఎరవేసింది. ఆ తర్వాత అతన్ని పెళ్లి చేసుకుంది.. చివరికి అసలు విషయం తెలియడంతో ఆమెకు అమెరికా సైంటిస్ట్ విడాకులు ఇచ్చాడు.