Bird Flu: పక్షులకు సోకే బర్డ్ ఫ్లూ.. అతి త్వరలో మరో మహమ్మారిగా మారబోతోందా.. మనుషులకు సోకే అవకాశాలు పెరుగుతున్నాయా అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. బర్డ్ ఫ్లూ ఏళ్లుగా పక్షులకు సోకుతున్న వైరస్. కానీ, ఇది క్రమంగా రూపాంతంరం చెందుతోంది. బలంగా తయారవుతోంది. ఒకప్పుడు పక్షోల్లో మాత్రమే కనిపించే ఈ వైరస్ ఇప్పుడు జంతువులకు సోకుతోంది. తాజాగా అమెరికాలోని ఆవులకు ఈ వైరస్ సోకినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పక్షుల నుంచే జంతువులకు వ్యాప్తి చెందినట్లు నిర్ధారించారు.
ఇప్పుడు పాలల్లో..
ఇక ఇప్పుడు ఆవుల పాలల్లో కూడా బర్డ్‌ఫ్లూ (H5N1) వైరస్ అధిక సాంద్రతతో ఉన్నట్లు గుర్తించారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (who) కూడా స్పందించింది. అమెరికాలోని ఆవు పాలలో హెచ్5ఎన్1 వైరస్ అధిక సాంద్రతల్లో ఉండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. అయితే పచ్చిపాలలో మాత్రమే ఈ వైరస్ ఉంటుందని, వేడి చేసిన తర్వాత చచ్చిపోతుందని నిపుణులు అంటున్నారు. అయినా అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది.
ఆరు రాష్ట్రాల్లో విజృంభణ..
అమెరికాలోని ఆవులు, గేదెల్లో బర్డ్‌ఫ్లూ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు ఆరు రాష్ట్రాల్లో కనీసం 13 మందలను ప్రభావితం చేసింది. టెక్సాస్, కాన్సాస్, మిచిగాన్, న్యూ మెక్సికో, ఇడాహో, ఒహియో, నార్త్ కరోలినా, సౌత్ డకోటాలోని ఆవు పాలల్లో బర్డ్‌ఫ్లూ వైరస్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారని డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ ఇన్‌ఫ్లుఎంజా ప్రోగ్రామ్ హెడ్ డాక్టర్ వెన్కింగ్ జాంగ్ తెలిపారు. ఇది పక్షుల నుంచి ఆవుకు తర్వాత ఆవు నుంచి ఆవులకు వ్యాపిస్తోందని తెలిపారు.
1996లోనే గుర్తింపు..
ఇక బర్డ్ ఫ్లూ కారక హెచ్5ఎన్1 వైరస్‌ను 1996లో ప్రారంభంలో తొలిసారిగా గుర్తించారు. ఆ తరువాత వేగంగా విస్తరించింది. 2020 నుంచి బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడంతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అడవి పక్షులు, పౌల్ట్రీలు మరణించాయి. ఈ వైరస్ మానవులు, పిల్లులు, ఎలుగుబంట్లు, నక్కలు, మింక్, పెంగ్విన్‌లతో సహా వివిధ క్షీరదాలకు సోకింది. గత నెలలో అమెరికాలో ఆవులు , మేకలు కూడా ఈ జాబితాలో చేరిపోయాయి.
మనుషులకు ప్రమాదం..
జంతువుల వరకు వచ్చిన వైరస్.. మనుషుల వరకు రాదనే గ్యారంటీ లేదంటున్నారు వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు. వైరస్ రూపాంతరం చెంది బలంగా తయారైతే భవిష్యత్‌లో మానవాళికి ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఒకరికి సోకితే.. మనిషి నుంచి మనిషికి వేగంగా వ్యాప్తి చెందుతుందని పేర్కొంటున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.