Bangladesh Election Results 2026: బంగ్లాదేశ్లో ఏడాదిన్నర పాటు కొనసాగిన మహ్మదు యూనస్ పాలనకు తెరపడనుంది. షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏడాదిన్నర క్రితం దేశంలో అల్లర్లు చెలరేగాయి. హింసాత్మకంగా మారాయి. ఏకంగా ప్రధాని ఇంటిపైకే దాడి చేశారు నిరసనకారులు దీంతో షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. యూనస్ పూర్తిగా భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. చైనా, పాకిస్తాన్తో స్నేహం పెంచుకున్నారు. ఏడాదిన్నరగా దేశంలో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. మైనారిటీలు అయిన హిందువులపై దాడులు జరిగాయి. చాలా మందిని చంపేశారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల సమయంలోనూ హింస చెలరేగింది.
బీఎన్పీ విజయం…
బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) ఘన విజయం సాధించింది. మొత్తం 299 స్థానాల్లో మిత్రాలతో కలిపి 212 స్థానాలు సాధించడంతో ప్రభుత్వ ఏర్పాటు మార్గం సుగమమైంది. గట్టి పోటీ ఇస్తుంది అనుకున్న జమాత్–ఏ–ఇస్లామీ 70 స్థానాలకే పరిమితమైంది. మిగిలిన స్థానాల్లో ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పొందారు.
15 ఏళ్ల తర్వాత తారిఖ్ రహ్మాన్ నాయకత్వం
మహ్మద్ ఖలీదా బేగం నేతృత్వంలో బీఎన్పీ పార్టీ గతంతో రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. తర్వాత షేక్ హసీనా పార్టీ వరుసగా మూడుసార్లు గెలిచింది. దీంతో బీఎన్పీ 15 ఏళ్లు అధికారానికి దూరమైంది. ఖలీదా బేగం ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. దీంతో తారిఖ్ రహ్మాన్ పార్టీ పగ్గాలు చేపట్టారు. ఎన్నికల్లో పోటీ చేశారు. ఘన విజయం సాధించారు. బీఎన్పీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధపడుతోంది.
రెండు స్థానాల్లో తారిఖ్ విజయం..
ఈ ఎన్నికల్లో తారిఖ్ రహ్మాన్ రెండు చోట్ల పోటీ చేశాడు. ఢాకా 17, బోగ్రా 6 నియోజవర్గాల నుంచి బరిలో నిలిచారు. రెండు స్థానాల్లో ఓటర్లు ఆయనకు పట్టం కట్టారు. ఇక తల్లి ఖలీదా మరణం నేపథ్యంలో బీఎన్పీ విజయోత్సవాలకు దూరంగా ఉంది. కార్యకర్తలకు సాధారణ ప్రార్థనలు మాత్రమే నిర్వహించమని సూచించారు.
ఈ ఫలితాలు బంగ్లాదేశ్ రాజకీయాల్లో పెద్ద మార్పును సూచిస్తున్నాయి. బీఎన్పీ మెజారిటీ సాధించడం వల్ల కొత్త పాలనా వ్యవస్థ ఆవిర్భవించే అవకాశం ఉంది. జమాత్–ఏ–ఇస్లామీ బలపడం వివాదాలను రేకెత్తించవచ్చు, కానీ స్థిరత్వానికి దోహదపడవచ్చు.