America Shutdown: రోమ్ తగలబడుతూనే చక్రవర్తి ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నాడని చరిత్ర చెబుతుంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. అమెరికా నెల రోజులుగా షట్‌డౌన్‌లో ఉంది. ఫెడరల్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన నిర్ణయంపై నుంచి వెనక్కి తగ్గడం లేదు. నెలకు పైగా కొనసాగిన ఈ షట్‌డౌన్ అమెరికా చరిత్రలోనే అతి దీర్ఘ కాలిక రాజకీయ స్థితిగా నమోదైంది.
చోద్యం చూస్తున్న ట్రంప్..
నవంబర్ 7న సెనేట్‌లో ప్రభుత్వ నిధుల మంజూరుపై ఓటింగ్ జరగనుందని ప్రకటించినా, అది పరస్పర అంగీకారం కాని రాజకీయ ప్రకటనగానే మిగిలింది. డెమోక్రాట్లు సబ్సిడీలు లేకుండా తాత్కాలిక ఫండింగ్ బిల్లు ప్రతిపాదించగా, ట్రంప్ ఆమోదం నిరాకరించారు. ఫలితంగా ప్రభుత్వ యంత్రాంగం సగం మూతపడింది. సుమారు 14 లక్షల సివిల్ ఫెడరల్ ఉద్యోగుల్లో సగం మంది సెలవుల్లో ఉన్నారు. అత్యవసర సేవల్లో ఉన్నవారు మాత్రం జీతం లేకపోయినా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎప్పుడో రాబోయే చెల్లింపుల మాటలు మాత్రమే మిగిలాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, సెక్యూరిటీ సిబ్బంది జీతం కాకుండా పనిచేయడంతో వందలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని రద్దు కూడా అవుతున్నాయి. మ్యూజియాలు మూతపడ్డాయి. వ్యవసాయ, ఆరోగ్య సబ్సిడీలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో మేరీలాండ్, లూసియానా వంటి రాష్ట్రాలు ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాయి.
పంతం వీడని ట్రంప్..
ఒక్క వ్యక్తి పట్టు పట్టిన ఆర్థిక విధానాల వలన మిలియన్ల అమెరికన్లు కష్టాల్లో ఉన్నప్పటికీ, ట్రంప్ మాత్రం మొడిగానే వ్యవహరిస్తున్నారు. వలస పాలసీలపై దృష్టి కేంద్రీకరించారు. ఇటీవల డయాబెటిస్ ఉన్న విదేశీయులను దేశంలోకి రాకుండా ఆదేశించమనే నిర్ణయ ప్రక్రియలో ఉన్నారని సమాచారం. ఇది రాజకీయం మించిన మానవతావాద సమస్యగా మారింది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ట్రంప్ ప్రభావం తగ్గుతుంది అనే సంకేతాలు స్పష్టంగా కన్పించాయి. వచ్చే సంవత్సరం జరిగే మధ్యంతర ఎన్నికల్లో ఆయన వ్యతిరేకత మరింత పెరగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ అధ్యక్షుడు తన రాజకీయ పంతం, నిర్ణయాల దారిలోనే కొనసాగుతున్నారు. ప్రజా సేవలపై ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నా.. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నట్లు ఉన్నారు.
ఈ షట్‌డౌన్ పాలనకే కాదు.. ప్రజాస్వామ్య వ్యవస్థకు కూడా పరీక్ష. ప్రభుత్వ పరిపాలన ఆగిపోవడం అంటే పౌర జీవితానికి ఒక దెబ్బ. కానీ ఈ పరిస్థితిలో కూడా అధ్యక్షుడు చుట్టూ తిరిగే రాజకీయ అహం ప్రధానంగా నిలిచింది. ప్రజల పాలన కోసం రాజకీయం ఉందా, లేక రాజకీయం కోసం ప్రజలను బలి చేయడమా అని అమెరికా ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం వచ్చింది.