Homeఅంతర్జాతీయంDonald Trump : ట్రంప్ పై హత్యాయత్నం ఘటన తర్వాత.. అమెరికాలో ఏంటీ పరిస్థితి? అధ్యక్ష...

Donald Trump : ట్రంప్ పై హత్యాయత్నం ఘటన తర్వాత.. అమెరికాలో ఏంటీ పరిస్థితి? అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు?

Donald Trump : మరి కొద్ది నెలల్లో అమెరికా దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికల్లో గత ప్రత్యర్థులు జోబైడన్, డొనాల్డ్ ట్రంప్ మరోసారి తలపడనున్నారు. ప్రస్తుతం ట్రంప్ అమెరికా వ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ర్యాలీలలో పాల్గొంటున్నారు. బైడన్ ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. బైడన్ అధ్యక్షుడు అయిన తర్వాత అమెరికా పరువు మొత్తం పోయిందని దుయ్యబడుతున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ ఆదివారం పెన్సిల్వేనియా ప్రాంతంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ట్రంప్ బైడన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశంలో అక్రమ వలసలు పెరిగిపోయాయని మండిపడ్డారు. అమెరికన్ యువతకు ఉపాధి లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు స్థానికంగా ఉన్న అమెరికా యువతకే దక్కాలని ఆయన డిమాండ్ చేశారు. తాను అధికారంలోకి వస్తే అదే పనిని మొదలు చేస్తానని ప్రకటించారు. ఇదే సమయంలో ఓ దుండగుడు ఐదు షాట్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ యువకుడు మరణించాడు. మరో యువకుడు గాయపడ్డాడు. అయితే ఒక బుల్లెట్ ట్రంప్ చెవిని తగులుతూ వెళ్ళింది. ఆ ప్రమాదంలో ట్రంప్ చెవికి తీవ్రంగా గాయం కావడంతో అధికంగా రక్తస్రావమైంది.

మద్దతు పెరిగిందట..

ఈ ఘటన అమెరికానే కాదు ప్రపంచాన్ని కూడా షాక్ కు గురిచేసింది. ప్రపంచ వ్యాప్తంగా మీడియా సంస్థలు ట్రంప్ పై హత్యాయత్నం ఘటనకు సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేయడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ప్రముఖ పోల్ స్టర్ అమెరికాలో పరిస్థితి పై ఒక నివేదికను రూపొందించింది. ఘటన జరిగిన తర్వాత ప్రజల మద్దతు ఎవరికి పెరిగిందో ఒక అంచనా వేసింది. దీని ప్రకారం అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచేందుకు 70% అవకాశాలు ఉన్నాయట. హత్యాయత్నం జరిగిన తర్వాత ట్రంప్ కు ప్రజలు ఇచ్చే మద్దతు ఎనిమిది శాతం పెరిగిందట. ” ప్రజల్లో ట్రంప్ పై విశ్వాసం పెరిగింది. ఆదివారం ఆయన ప్రజల మద్దతును ఎనిమిది శాతం పెంచుకున్నారు. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కంటే ట్రంప్ ముందు వరసలో ఉన్నారు. ట్రంప్ గెలిచేందుకు దాదాపు 70 శాతం అవకాశాలు ఉన్నాయి. ఆయన ప్రచారానికి కూడా విరాళాలు విపరీతంగా పెరిగాయని” పోల్ స్టర్ తన నివేదికలో పేర్కొంది.

ప్రశంసల జల్లు కురుస్తోంది

హత్యాయత్నం జరిగిన సమయంలో ట్రంప్ ఏమాత్రం భయపడలేదు. తన వైపు బుల్లెట్ దూసుకొస్తున్నప్పటికీ ఆయన ధైర్యంగా ఉన్నారు. పైగా వేదికపై నుంచి లేచి “ఫైట్.. ఫైట్ అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ట్రంప్ చూపించిన ఆత్మస్థైర్యం ప్రజల్లో ఆయనపై అభిమానాన్ని మరింతగా పెంచిందని తెలుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ట్రంప్ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు

వచ్చే నవంబర్ నెలలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫునుంచి ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలోని బట్లర్ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు. సమీపంలో ఉన్న ఓ భవనం పైకెక్కిన ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ట్రంప్ చెవికి గాయమైంది. ఇదే సమయంలో అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ సిబ్బంది వెంటనే స్పందించారు. గాయపడిన ట్రంప్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఘటన తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పందించారు. ప్రశాంతతకు నెలవైన అమెరికాలో హింసకు ఏమాత్రం చోటు లేదని స్పష్టం చేశారు. ఘటన జరిగిన తర్వాత వెంటనే స్పందించిన అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ సిబ్బందిని అభినందించారు.

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website
RELATED ARTICLES

Most Popular