IT Layoffs: ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. పింక్ స్లిప్ లు మెడపై కత్తిలా వేలాడుతున్నాయి. మొత్తానికి దశాబ్దంన్నర క్రితం నాటి పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి. వెరసి ఒక చేతితో డిగ్రీ పట్టా, మరో చేతితో కాలిన పొట్ట పెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక మాంద్యం, కోవిడ్, రష్యా, ఉక్రెయిన్ యుద్దమే ఇందుకు కారణాలని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. టెక్ కంపెనీల్లో శ్రమదోపిడి అధికంగా ఉంటుంది.. పేరుకు ఐదు అంకెల జీతం అనుకుంటాం కానీ వాస్తవ పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. ఊపిరి సలపని పని ఒత్తిడి ఉద్యోగులను ఒక్కరి బిక్కిరి చేస్తోంది. ఇవన్నీ భరించి పని చేస్తున్నా ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండటం లేదు.

అడ్డగోలుగా..
అమెజాన్ తన 28 ఏళ్ల చరిత్రలోనే అత్యధికంగా 18 వేల ఉద్యోగాలకు సిద్ధమైంది. మైక్రోసాఫ్ట్ పదివేల మంది ఉద్యోగుల తొలగింపునకు గురి పెట్టింది. గూగుల్ తన మాతృ సంస్థ ఆల్ఫా బెట్ నుంచి 12 వేల మందికి ఉద్వాసన పలుకుతానంటోంది. ఇక ఏడాది జరిగిన కోతల్ని చూస్తుంటే…104 టెక్ కంపెనీలు జనవరి 15 లోపు 24 వేల మందిని ఇంటికి పంపించేశాయి. ఈ కోతలు టెకీల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి. భవిష్యత్తుపై భయాన్ని రేకెత్తిస్తున్నాయి. ఇక శుక్రవారం గూగుల్ తన మాతృ సంస్థయిన ఆల్ఫా బెట్ నుంచి 12,000 మందికి ఉద్వాసన పలకటం సంచారం సృష్టించింది. ఇక తీసివేతలు అమెరికాలో వెంటనే అమలులోకి వచ్చాయి. మిగతా దేశాల్లో మాత్రం స్థానిక చట్టాల ప్రకారం ఈ తీసివేతలకు కొద్దిగా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ” గడిచిన రెండు సంవత్సరాలలో వృద్ది పథంలో కొనసాగేందుకు కృషి చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని” గూగుల్ చెబుతోంది. మైక్రోసాఫ్ట్ నుంచి 10,000 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపిస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే గూగుల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అమెజాన్ కూడా త్వరలో 12,000 మంది ఉద్యోగులని బయటికి సాగనంపనుంది.

అప్పట్లో ఇలా
2008లో తీవ్రమైన ఆర్థిక మాంద్యం ప్రబలింది. అమ్మకాలు, కొనుగోళ్ళు నిలిచిపోయాయి. దీంతో కంపెనీలు ఉద్యోగుల కోత మొదలుపెట్టాయి. అప్పట్లో 65 వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఆ మరుసటి ఏడాది కూడా అదే స్థాయిలో తొలగింపులు జరిగాయి. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మహా మాంద్యం తాలూకు నాటి కంటే ఎక్కువ కోతలు పడుతున్నాయి. ” లే ఆప్స్ డాట్ ఎఫ్ వై ఐ గణాంకాల ప్రకారం ఒక్క 2022 లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000 టెక్ కంపెనీలు 1,54,336 మంది ఉద్యోగులను తొలగించాయి. అంతటి కొవిడ్ మహామ్మారి విలయ తాండవం చేసిన 2020, 2021 సంవత్సరాలలో 1,495 కంపెనీలు కలిసి తొలగించిన ఉద్యోగుల సంఖ్య 2.4 లక్షలు. వచ్చే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.